పటాన్‌చెరు (గుమ్మడిదల)/హత్నూర, వెలుగు: ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేకపోతోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుంపు మేస్త్రీకి గూబ గుయ్‌మనేలా తీర్పు ఇవ్వాలని కోరారు. సంగారెడ్డి జిల్లా హత్నూర, గుమ్మడిదల మండలాల్లో గురువారం నిర్వహించిన కార్నర్ మీటింగ్, రోడ్‌షోలలో ఆయన మాట్లాడారు.
‘ఇవి పదవులు, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నికలు కావు.. తెలంగాణ భవిష్యత్ కోసం జరుగుతున్న ఎన్నికలు’ అని చెప్పారు. కేసీఆర్‌కు నిజమైన దోస్తునని చెప్పకునే నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కష్టకాలంలో పార్టీని వదిలి పోతారా ? అని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.10 వేల రైతుబంధు, కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి అమలు చేయలేని హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను నమ్మొద్దని సూచించారు.
కాంగ్రెస్‌ను నిలదీయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ధరలు పెంచి, జీఎస్టీతో ప్రజలపై భారం మోపుతున్న బీజేపీతో రేవంత్‌రెడ్డి చేతులు కలిపారని ఆరోపించారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మకుండా ప్రజల కోసం కష్టపడే బీఆర్‌ఎస్‌కు, ప్రజలకు అందుబాటులో ఉండే వెంకట్రామిరెడ్డికి మద్దతు నిలవాలని కోరారు.
బీఆర్‌ఎస్ క్యాండిడేట్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే రూ. 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.