రేవంత్ ఎప్పటికీ ఉద్యమకారుడు కాలేడు : హరీశ్ రావు

  • సీఎంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్​

సిద్దిపేట రూరల్, వెలుగు : రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడేమో కానీ.. ఎప్పటికీ ఉద్యమకారుడు మాత్రం కాలేడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. ఆయన ఏ రోజూ జై తెలంగాణ అనలేదని, ఆయన తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని ఫైర్ అయ్యారు. సోమవారం సిద్దిపేట బీఆర్ఎస్ ఆఫీస్ లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండా ఎగరేసి ఉద్యమకారులను సన్మానించారు. తర్వాత మాట్లాడుతూ..

రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ లేదని, బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో పై భాగంలో జై తెలంగాణ, జైజై తెలంగాణ ఖచ్చితంగా ఉండేదన్నారు. ఆ రోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తెలంగాణ పదం మాయమైందన్నారు. తెలంగాణ హక్కుల కోసం ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు.

కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. అనంతరం చిన్నకోడూరు మండల కేంద్రంలోని నాయకమ్మ ఆలయ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.