దుబ్బాక ఆస్పత్రిలో సిబ్బంది కొరత

  •     డాక్టర్  పోస్టులు ఖాళీ
  •     వైద్య సేవలకు ఆటంకం
  •     సమస్యల మధ్యే ఆపరేషన్ల నిర్వహణ

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: దుబ్బాకలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో  సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. పేదలు వైద్య సాయం కోసం వస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడం వారికి భారంగా మారుతోంది. 2021 డిసెంబర్ లో అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వం రూ.20 కోట్ల వ్యయంతో  దుబ్బాక వంద పడకల ఆస్పత్రిని ఆర్భాటంగా ప్రారంభించింది.  కానీ సరైన విధంగా  వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపలేదు. ప్రతీ రోజు నాలుగు వందల పై చిలుకు అవుట్ పేషంట్లు ఆస్పత్రికి వస్తే సాధారణ వైద్యం మాత్రమే అందిస్తున్నారు. ప్రత్యేక వైద్యం అవసరమైన రోగులను  సిద్దిపేటలోని జిల్లా ఆస్పత్రికి పంపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

32 డాక్టర్​పోస్టులు ఖాళీ

 దుబ్బాక వంద పడకల ఆస్పత్రిలో డాక్టర్లతో సహా మొత్తం 112 మంది సిబ్బంది పనిచేయాలి. కానీ 48 మంది డాక్టర్లకు గాను 16 మంది మాత్రమే  పనిచేస్తున్నారు. వీరిలో 8  మంది రెగ్యులర్, మరో 8  మంది కాంట్రాక్ట్  బేసిక్ పద్దతిలో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒక జనరల్ సర్జన్, ఇద్దరు  గైనకాలజిస్ట్, ఇద్దరు అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, డెంటల్, ఆప్తమాలాజీ, పిడియాట్రిషన్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.  ఆర్థో పెడిక్, ఈఎన్టీ విభాగాల్లో పరికరాలతో పాటు గర్భిణులను పరీక్షించేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రం, రేడియాలజిస్ట్, బ్లడ్ బ్యాంక్, ల్యాప్రోస్కోపి ఎక్విప్ మెంట్స్ లేక పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఐసీయూకు తాళం వేసి ఉంచుతున్నారు. ప్రసవాల సమయంలో ఇబ్బందులు ఏర్పడితే సిద్దిపేటకు పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

అరకొరగా వైద్య సిబ్బంది

దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందించడం కోసం అవసరమయ్యే సిబ్బంది సైతం అరకొరగానే ఉన్నారు. మొత్తం 38  మంది నర్సింగ్ స్టాప్ లో 32  మంది పని చేస్తుండగా 6 పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. 18 మంది పారా మెడికల్ స్టాప్ లో నలుగురు రెగ్యులర్, ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మిగతా 11 పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. ఆఫీస్ స్టాప్ లో కేవలం ఇద్దరు మాత్రమే  పనిచేస్తుండగా 6 పోస్టులు  ఖాళీగా ఉన్నాయి.  శానిటేషన్ విభాగంలో 38 మంది పనిచేస్తుండగా 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య సేవలకు కీలకమైన  ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు  నాలుగు ఖాళీగా  ఉండడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు.  

ఆపరేషన్లలో ప్రత్యేకత

వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నా దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి ఆపరేషన్లు చేయడంలో ప్రత్యేకతను సాధించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 18 రకాల ఆపరేషన్ల ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అపెండిక్స్, ఒవేరియన్ సిస్ట, గాల్ బ్లాడర్ స్టోన్,  హైడ్రోసిల్, వివిధ రకాల హెర్నియాలు, శరీరంపై గడ్డలు, ఫైల్స్, ఫైబ్రాయిడ్ గడ్డలు, లైపోమా, గర్భ సంచి ఆపరేషన్లను విజయవంతంగానిర్వహిస్తున్నారు. 

రోగులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం

దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో  సిబ్బంది కొరత ఉన్నా రోగులకు వైద్య సేవల్లో ఆటంకం కలగకుండా చూస్తున్నాం. ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ తో పాటు స్కానింగ్ మిషన్, రేడియాలజిస్ట్ ను మంజూరు చేయాలని ఉన్నతాధికారుల కోరాం. 
- హేమరాజ్ సింగ్, సూపరింటెండెంట్