దారి ఇవ్వకుంటే కఠిన చర్యలు : శ్రీనివాస్​చారి

శివ్వంపేట, వెలుగు: రైతులకు దారి ఇవ్వకుంటే రోడ్డును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శివ్వంపేట తహసీల్దార్​ శ్రీనివాస్​చారి హెచ్చరించారు. మండలంలోని కొంతాన్​పల్లి కరీంకుంటలో వ్యవసాయ పొలాలకు వెళ్లే  దారిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఓ ప్రజాప్రతినిధి కబ్జా  చేయడంతో రెవెన్యూ ఆఫీసర్లు గతేడాది సర్వే చేసి హద్దులు పెట్టారు. 

అప్పటినుంచి రియల్ ఎస్టేట్ ​వ్యాపారులు రైతులను ఆ దారి వెంట వ్యవసాయ పొలాల్లోకి వెళ్లనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో తన ఆఫీస్​లో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తహసీల్దార్ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు పొలాలకు వెళ్లే దారిని వదిలేయాలని, లేదంటే దారిని కబ్జా చేసిన వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ హరికృష్ణ, ఆర్ఐ కిషన్,  సర్వేయర్ సతీశ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,  మండల  రైతు సమితి మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.