ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!

ఇండియన్ స్టాక్ మార్కెట్.. ఎప్పుడు పెరుగుతుందో.. ఎందుకు పెరుగుతుందో.. ఎంత పెరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అదానీ అవినీతి లంచాల వ్యవహారాన్ని అమెరికా బయటపెట్టిన తర్వాత.. నిన్నటికి నిన్న స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అయ్యింది. ఇవాళ కూడా.. అంటే 2024, నవంబర్ 22వ తేదీ శుక్రవారం సైతం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ కావొచ్చు అనే అంచనాలను పటాపంచలు చేస్తూ.. స్టాక్ మార్కెట్ రాకెట్ లా దూసుకుపోయింది. అలా ఇలా కాదు.. ఏకంగా 2 వేల పాయింట్లు లాభపడింది. 

సెన్సెక్స్ 2 వేల పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 600 పాయింట్ల వరకు లాభపడింది. ఏకంగా 2.50 శాతం పెరిగింది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటం వెనక ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

>>> అమెరికాలో ఉద్యోగాలకు సంబంధించిన డేటా రిలీజ్ అయ్యింది. ఈ డేటాలో.. అమెరికాలో ఉద్యోగాల వృద్ధి గణనీయంగా పెరిగిందని.. నిరుద్యోగ క్లయిమ్స్ 6 వేలు తగ్గాయని స్పష్టం చేసింది. నిరుద్యోగ క్లయిమ్స్ 6 వేలు తగ్గటం అనేది.. గత ఏడు నెలల్లో ఇదే కావటం విశేషం. దీంతో ఐటీ షేర్లలో ఊపు వచ్చింది. పాజిటివ్ ట్రేడ్ జరిగింది. టీసీఎస్, విప్రో వంటి ఐటీ షేర్లు 2 శాతంపైగా లాభపడ్డాయి. 
>>> ఊహించని విధంగా అదానీ షేర్లలో ర్యాలీ కనిపించింది. షేర్లు కొనుగోలు చేయటానికి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఉత్సాహం చూపటంతో.. మార్కెట్ లో జోష్ కనిపించింది.
>>> అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిక్కీ, డౌజోన్స్, వాల్ స్ట్రీట్, నాస్ డాక్ వంటి స్టాక్ ఎక్చేంజ్ లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
>>> చైనా స్టాక్ మార్కెట్ ఏకంగా 3 శాతం నష్టపోయింది. చైనా కంపెనీల్లోని పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ప పెట్టుబడిదారులు.. ఆ డబ్బును ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కొనుగోళ్లు చేయటంతో స్టాక్ మార్కెట్ ఉత్సాహంగా పరుగులు తీసింది. 

మొత్తానికి అదానీ ఇష్యూ ప్రభావం పెద్దగా చూపించకపోగా.. భారీ లాభాల్లో వీకెండ్ ముగియటంతో ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నారు.