సర్కార్ బడికి వేళాయె .. ఇయాల్టి నుంచి స్కూల్స్​రీ ఓపెన్

  • టెక్ట్స్, నోట్​బుక్స్, యూనిఫామ్స్​ సిద్దం చేస్తున్న అధికారులు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఎండాకాలం సెలవులు  ముగిశాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు 49 రోజుల సెలవుల అనంతరం ఇయాల్టి నుంచి స్కూల్స్​రీ ఓపెన్​అవుతున్నాయి. సర్కార్​ స్కూళ్లలో చదువుకునే స్టూడెంట్స్​కు ఫ్రీగా టెక్స్ట్​, నోట్ బుక్స్, యూనిఫామ్స్​ అందించనున్నారు. అమ్మ ఆదర్శ స్కూళ్ల కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు మెరుగు పరిచే పనులు చేపట్టారు. బడి గంట మోగనుండడంతో స్టూడెంట్స్​ స్కూల్​కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది.  

మెదక్ జిల్లాలో..

జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం1,084 స్కూల్స్ ఉండగా, వాటిల్లో1,35,727 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో  ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ, హైస్కూల్స్​966 ఉండగా వాటిల్లో 94,312 మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. 118 ప్రైవేట్​ స్కూళ్లలో 41,415 మంది స్టూడెంట్స్​ ఉన్నారు. 2024,- 25 అకాడమిక్​ ఇయర్​కు ఒకటి నుంచి 10వ తరగతి వరకు 10,58,304 టెక్ట్స్​బుక్స్​అవసరం ఉండగా దాదాపు పూర్తిగా వచ్చాయని, వాటిని  మండలాలకు చేరవేసినట్టు జిల్లా టెక్ట్స్​బుక్ సేల్స్​ఆఫీసర్​మేనేజర్​ శ్రీధర్​ తెలిపారు.

 అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద జిల్లాలో 526 స్కూళ్లలో రూ.20.65 కోట్ల అంచనాతో తాగునీటి వసతి, ఎలక్ట్రిఫికేషన్, టాయిలెట్స్​రిపేర్, బిల్డింగ్​మైనర్​రిపేర్​  వంటి పనులు చేపట్టారు. ఆయా పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని డీఈవో రాధాకిషన్​ తెలిపారు. యూనిఫామ్స్​స్టిచ్చింగ్​ 80 శాతం పూర్తయిందని తెలిపారు. స్కూల్స్​రీ ఓపెన్​రోజునే స్టూడెంట్స్​కు టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్స్​ అందిస్తామని పేర్కొన్నారు.

బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆయా స్కూళ్ల​హెచ్​ఎంలు, టీచర్లు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా కలెక్టర్ రాహుల్​రాజ్​ఈ కార్యక్రమంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్వయంగా ఆయన నర్సాపూర్​ మండలం జక్కపల్లిలో సోమవారం రాత్రి పల్లెనిద్ర చేసి మంగళవారం ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,297 గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా అందులో 1.30 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. హైస్కూల్స్  203, యూపీఎస్​ 192, పీఎస్ 852 స్కూల్స్ ఉన్నాయి. ఆయా స్కూళ్లకు గాను 5,947 వివిధ కేటగిరీలలో టీచర్ పోస్టులు శాంక్షన్ కాగా 5,039 మంది టీచర్లు పనిచేస్తున్నారు. జిల్లాలో అన్ని కేటగిరీలలో కలిపి మరో 908 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ కు ఫ్రీగా అందించే పాఠ్యపుస్తకాలు ఇప్పటివరకు 70 శాతం చేరినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే సర్కారు బడులను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న మౌలిక వసతుల పనులు దాదాపుగా 80 శాతం పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 756 బడుల్లో స్వయం సహాయక సంఘాల పర్యవేక్షణలో కొనసాగుతుండగా కొన్నిచోట్ల కాంట్రాక్టర్లకు అప్పగించి పనులు పూర్తి చేయిస్తున్నారు.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో మొత్తం 1100 గవర్నమెంట్ స్కూల్స్ లో 82 వేల39 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇంకా అడ్మిషన్​లు కొనసాగుతుండగా, బడిబాట కార్యక్రమం ద్వారా బడీడు పిల్లలను బడిలో చేర్పించే ప్రక్రియ కొనసాగుతోంది. యునిఫామ్స్ స్టిచ్చింగ్ 90 శాతం పూర్తయింది. ఒక జత యూనిఫామ్ ఇప్పటికే స్కూల్స్ కు చేరిపోయింది. మరోజత 2 నుంచి మూడు రోజుల్లో చేరనుంది. జిల్లాలో  980 స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద మౌలిక వసతులు మెరుగుపరిచే పనులు చేపట్టారు. టెస్ట్ బుక్స్ పంపిణీ 100 శాతం పూర్తయింది. అన్ని స్కూల్స్ కు బుక్స్ చేరుకున్నాయి. జిల్లాలోని 250 ప్రైవేట్ స్కూళ్లలో 372 స్కూల్ బస్సుల్లో ఇప్పటివరకు 170 స్కూల్ బస్సులకు ఫిట్​నెస్​పరీక్షలు నిర్వహించారు. 

ప్రైవేట్ బస్సులు సేఫేనా? 

ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు స్కూల్ బస్సుల ఫిట్ నెస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,732 స్కూల్ బస్సులు ఉండగా ఇప్పటివరకు 1,050 బస్సులకు  మాత్రమే ఫిట్​నెస్​జరిగినట్టు ఆర్టీఏ అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా 682 బస్సులు ఫిట్​నెస్​చేయించుకోవాల్సి ఉంది. కొన్నిచోట్ల కాలం చెల్లిన బస్సులను తిప్పేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.

చాలా  స్కూల్ బస్సుల్లో ఫస్ట్ఎయిడ్ బాక్సులు కనిపించడం లేదు. బస్సు ఎక్కేమెట్లు ఎత్తుగా ఉండకుండా పిల్లలకు సౌకర్యంగా ఉండేలా అదనపు మెట్టు ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ చాలా యాజమాన్యాలు పాటించడం లేదు. ప్రతీ ఏడాది స్కూల్ బస్సులకు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నప్పటికీ ఇటు ఆర్టీఏ, అటు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఫిట్​నెస్​లేని స్కూల్ బస్సులను సీజ్ చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.