లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్ గ్రామ సమీపంలోని సరస్వతి కెనాల్‌పై ఉన్న అయ్యకట్ట బ్రిడ్జి గురువారం సాయంత్రం కుప్పకూలింది. కొన్ని సంవత్సరాల కిందనే ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోలేదు. నిధులు మంజూరయ్యాయని చెబుతున్నారే తప్పా.. ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోవడంతో ఆయకట్ట కింద ఉన్న రైతులు తమ పొలాలను ఎలా పండించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
మామడ మండలంలోని పరిమండల్ గ్రామ చెరువు ఆయకట్టు నుంచి వడ్యాల్ చెరువులోకి ఈ బ్రిడ్జి మీదుగానే నీరు వస్తుందని..ఇప్పుడు ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఆ నీరంతా మళ్లీ సరస్వతి కెనాల్ లోనే కలిసిపోతుందని, ఫలితంగా తమ పంటలు పండించుకునే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. బ్రిడ్జి కూలిన విషయంపై ఇరిగేషన్ ఏఈ మధుకర్‌ను వివరణ కోరగా అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఎన్నికల కోడ్ కారణంగా పనులు ముందుకు సాగలేదన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.