ఆర్‌‌బీఐ కొత్త గవర్నర్‌‌‌‌‌‌‌‌గా సంజయ్ మల్హోత్రా

  • రెవెన్యూ సెక్రెటరీకి అవకాశమిచ్చిన ప్రభుత్వం ఈ నెల 11 నుంచి పదవిలోకి..
  • మంగళవారంతో ముగియనున్న శక్తికాంత దాస్ రెండో టర్మ్‌‌‌‌

న్యూఢిల్లీ: రెవెన్యూ సెక్రెటరీగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రా (56)  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ) 26 వ గవర్నర్‌‌‌‌‌‌‌‌గా   నియమితులయ్యారు. ఈ నెల 11 నుంచి ఆయనీ బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుత ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌ శక్తికాంత దాస్ (67) పదవీ కాలం మంగళవారం (డిసెంబర్ 10) తో  ముగుస్తుంది. దాస్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌‌‌‌‌గా ఆరేళ్లు పనిచేశారు.  పదవీ కాలం ముగిసే రెండు రోజుల ముందు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తారని అంచనా వేసినా, ప్రభుత్వం మాత్రం సంజయ్‌ మల్హోత్రాను ఆర్‌‌బీఐ గవర్నర్‌‌గా నియమించింది. గత కొన్ని నెలలుగా వడ్డీ రేట్లు తగ్గించాలని ప్రభుత్వం కోరుతున్నా, ఆర్‌‌బీఐ మాత్రం రేట్లను యథావిధిగా కొనసాగించిన విషయం తెలిసిందే. మల్హోత్రా ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌‌‌‌‌గా రానున్న మూడేళ్ల పాటు సేవలందిస్తారు. 

ట్యాక్స్ వసూళ్లు పెంచారు

సంజయ్ మల్హోత్రా ఐఐటీ కాన్పూర్‌‌‌‌‌‌‌‌లో డిగ్రీ పూర్తి చేశారు. పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీని ప్రిన్స్‌‌‌‌టన్‌‌‌‌ యూనివర్సిటీ (యూఎస్‌‌‌‌)లో  చేశారు.  ఆయన  1990 ఐఏఎస్‌‌‌‌ బ్యాచ్‌‌‌‌ రాజస్థాన్‌‌‌‌ క్యాడర్‌‌‌‌‌‌‌‌కి చెందినవారు.  ప్రస్తుతం రెవెన్యూ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ కంపెనీ ఆర్‌‌‌‌‌‌‌‌ఈసీకి చైర్మన్‌‌‌‌గా, ఎండీగా కూడా గతంలో పనిచేశారు.   తాజాగా ప్రభుత్వ ట్యాక్స్ కలెక్షన్‌‌‌‌ పెరగడంలో మల్హోత్రా కీలకంగా ఉన్నారు.  జీఎస్‌‌‌‌టీ కౌన్సిల్‌‌‌‌లో సెక్రెటరీగా సేవలందించారు. అంతకుముందు  డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ (డీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌) లో సెక్రెటరీగా పనిచేశారు. ప్రభుత్వం తీసుకున్న కీలక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్కరణలను ఆయన హ్యాండిల్ చేశారు. డీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ సెక్రెటరీ కాకముందు పవర్ మినిస్ట్రీలో అదనపు సెక్రెటరీగా కూడా మల్హోత్రా సేవలందించారు.   రూ. 3 లక్షల కోట్ల విలువైన పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్కరణలను ప్రభుత్వం చేపట్టడంలో కీలకంగా ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న  డైరెక్ట్‌‌‌‌, ఇండైరెక్ట్‌‌‌‌ ట్యాక్స్ సంస్కరణలలో కీలకంగా పనిచేశారు. ఫైనాన్స్‌‌‌‌ మినిస్టర్  రెడీ చేసే బడ్జెట్‌‌‌‌లో రెవెన్యూ సెక్రెటరీ పాత్ర కీలకంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రవేశ పెడుతున్న బడ్జెట్‌‌‌‌ తయారీలో మల్హోత్రా పాత్ర ఉంది. ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ను తగ్గించడం,  రూపాయి కదలికలు, జియోపొలిటికల్ టెన్షన్లపై ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఫోకస్ పెట్టాలని  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మాజీ ఈడీ  దీపాలి పంత్ అన్నారు. ఫైనాన్స్‌‌‌‌ మినిస్ట్రీలోని అధికారులు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐలో పనిచేయడం చూస్తున్నామని, అందుకే పెద్దగా ఆశ్చర్యపోలేదని  ఎస్‌‌‌‌బీఐ మాజీ చైర్మన్  రజనీష్ కుమార్ అన్నారు. 

సంక్షోభ కాలంలో గవర్నర్‌‌‌‌.. దాస్‌‌‌‌‌‌‌‌

శక్తికాంత దాస్‌‌‌‌‌‌‌‌ (67)  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ 25 వ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12, 2018 న నియమితులయ్యారు. అప్పటి గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉర్జిత్ పటేల్ సడెన్‌‌‌‌‌‌‌‌గా రాజీనామా చేయడంతో ఆయనీ పదవిలోకి వచ్చారు. ఆయన రెండు టర్మ్‌‌‌‌‌‌‌‌ల పాటు ఈ పదవిలో ఉన్నారు. దాస్ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే కరోనా,  రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, హమాస్‌‌‌‌‌‌‌‌–ఇజ్రాయెల్ యుద్ధం వంటి సంక్షోభాలు గ్లోబల్ ఎకానమీని కుదిపేశాయి.  ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంలో దాస్‌‌‌‌‌‌‌‌ కీలకంగా పనిచేశారు. ఆయన హయాంలో  యూపీఐ పేమెంట్స్ వేగంగా విస్తరించాయి. ఆర్‌‌‌‌బీఐ డిజిటల్ రూపాయిని తీసుకొచ్చింది.  దాస్‌‌‌‌‌‌‌‌ 1980 ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ బ్యాచ్‌‌‌‌‌‌‌‌, తమిళనాడు కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందినవారు. ఎకనామిక్ అఫైర్స్‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ, ఫెర్టిలైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌మెంట్లలో సెక్రెటరీగా సేవలందించారు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఏడీబీ, ఎన్‌‌‌‌‌‌‌‌డీపీ, ఏఐఐబీలలో ఇండియా ఆల్టర్నేట్ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు.  గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది దాస్‌‌‌‌‌‌‌‌ను టాప్ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ బ్యాంకర్‌‌గా గుర్తించింది.