తెలంగాణలో నాలుగేండ్ల తర్వాత .. ‘మైక్రో ఇరిగేషన్’కు మోక్షం

  • ఫస్ట్​ఫేజ్​లో 85,313 ఎకరాల్లో  డ్రిప్, స్ర్పింక్లర్లకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం 
  •   50 వేల ఎకరాల్లో ఆయిల్​పామ్​కు.. 
  •   35,313 ఎకరాల్లో పండ్ల తోటలు, కూరగాయ పంటలకు కూడా .. 
  • రూ.509 కోట్లతో యాక్షన్​ప్లాన్ 
  • స్టేట్ ​లెవెల్ ​యాక్షన్ ​కమిటీ ఆమోదం  
  • జిల్లాల వారీగా, పంటల వారీగా లక్ష్యాల కేటాయింపు

మెదక్, వెలుగు : మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్​ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అనేక మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. నిధులివ్వకపవడంతో పండ్ల, కూరగాయల తోటలకు డ్రిప్, స్ప్రింక్లర్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది. అప్పట్లో నీటి వసతి తక్కువగా ఉన్న వేల మంది రైతులు డ్రిప్, స్ర్పింక్లర్ ​సిస్టం ద్వారా పండ్ల తోటలు, కూరగాయ పంటలు సాగు చేయాలని హార్టికల్చర్ ​డిపార్ట్​మెంట్​కు దరఖాస్తులు పెట్టుకున్నారు.

అయితే, గత ప్రభుత్వం మ్రైక్రో ఇరిగేషన్ ​స్కీంలకు నిధులు ఇవ్వకపోవడంతో సబ్సిడీ స్కీంలు అమలు కాలేదు. దీంతో అప్పటి నుంచి వేల మంది డ్రిప్, స్ప్రింక్లర్​సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, నాలుగేండ్ల తర్వాత కాంగ్రెస్ సర్కారు మైక్రో ఇరిగేషన్ ​ప్రాజెక్ట్​(టీజీఎంఐపీ)కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. 

రూ. 509 కోట్లతో ప్లాన్​

2024 –25 సంవత్సరానికి లక్ష ఎకరాల్లో ఆయిల్​పామ్, 70,625 ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటలకు సబ్సిడీ ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. దీనికోసం రూ.509 కోట్లతో రూపొందించిన యాక్షన్ ​ప్లాన్​కు స్టేట్ ​లెవెల్ ​యాక్షన్ ​కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఫస్ట్​ఫేజ్​లో రాష్ట్ర వ్యాప్తంగా 85,313 ఎకరాల్లో డ్రిప్, స్పింక్లర్లకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో అత్యధికంగా 50 వేల ఎకరాల్లో ఆయిల్​ పామ్​ తోటల్లో డ్రిప్ ​ఏర్పాటుకు

అలాగే పండ్ల తోటలు, కూరగాయ పంటలకు కలిపి 35,313 ఎకరాలకు సబ్సిడీ లభించనుంది. ఈ మేరకు హార్టికల్చర్ ​డిపార్ట్​మెంట్ జిల్లాల వారీగా, పంటల వారీగా లక్ష్యాలు నిర్ధేశించింది. ఫస్ట్ ​ఫేజ్​లక్ష్యాలు పూర్తయ్యాక సెకండ్​ ఫేజ్​లో యాక్షన్ ప్లాన్​కు అనుగుణంగా మిగతా ఎకరాలకు డ్రిప్, స్ర్పింక్లర్​ఏర్పాటుకు సబ్సిడీ మంజూరు చేస్తారు. 

ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ 

డ్రిప్, స్ప్రింక్లర్​ సిస్టం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న రైతులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ​పెట్టుకునేప్పుడు ఏ పంట సాగు చేస్తారో చెప్పడంతో పాటు డ్రిప్ ​కంపెనీని కూడా సెలెక్ట్​ చేసుకోవాలి. సదరు కంపెనీ ప్రతినిధులు వచ్చి భూమిని పరిశీలించి సబ్సిడీ మంజూరుకు ఆమోదం తెలుపుతారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఉంటుంది. 

ఏఏ పంటలకు..

ఆయిల్ పామ్​తో పాటు, పండ్ల తోటల్లో మామిడి, దానిమ్మ, జామ, బొప్పాయి, సపోట, డ్రాగన్ ​ఫ్రూట్​తోటల పెంపకానికి..కూరగాయల్లో టమాట, వంకాయ, బీర, కాకర తదితర వాటికి డ్రిప్, స్ప్రింక్లర్​సిస్టం ఏర్పాటు చేసుకునేందుకు మైక్రో ఇరిగేషన్​ ప్రాజెక్ట్ ​కింద సబ్సిడీ లభిస్తుంది.