సఫాయి కార్మికులకు వేతనాలివ్వాలి

  • జడ్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
  • చివరి సమావేశంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సఫాయి కార్మికులలకు ఏడు నెలలుగా వేతనాలు అందలేదని వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా పరిషత్ చివరి సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం రెడ్డి ఫంక్షన్ హాల్లో చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి మాట్లాడతూ జీపీల్లో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు వేతనాలు అందక పోవడం వల్ల సరైన విధంగా పారిశుధ్య పనులు జరగడం లేదని, వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని తీర్మానం చేయాలని కోరారు. 

దుబ్బాక జడ్పీటీసీ సభ్యుడు రవీందర్ రెడ్డి దీన్ని బలపరచగా సభ్యులు ఆమోదం తెలిపారు. ఇదే అంశంపై మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ జీపీల్లోని ట్రాక్టర్లకు ఈఎంఐలు, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని గత ప్రభుత్వ హయాంలో నేరుగా నిధులు పల్లెలకు పంపేదన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గవర్నమెంట్​స్కూళ్లలో ఖాళీగా ఉన్న తరగతి గదుల్లో అంగన్ వాడీ సెంటర్లు నిర్వహించేలా చూడాలని డీఈవోను కోరారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపికైన స్కూళ్ల పరిస్థితి ఏంటని అడగ్గా వంద స్కూళ్లకు కలరింగ్ పూర్తి చేయాల్సి ఉందనీ డీఈవో శ్రీనివాసరెడ్డి సమాధాన మిచ్చారు. 

రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి మాట్లాడుతూ రైతులకు అవసరమైన విధంగా పోల్స్ ఇవ్వడం లేదని సభ దృష్టికి తీసుకరాగా సమస్యను పరిశీలిస్తానని విద్యుత్ ఎస్ఈ మోహన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో అదనపు పోల్స్ ఏర్పాటుపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారుల దృష్టికి తెచ్చారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. 

మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి ఆయనకు మద్దతు తెలిపారు. మద్దూరు జడ్పీటీసీ కొండల్ రెడ్డి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ స్కూళ్ల పేరిట పలు స్కూళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటే, మన ఊరు మన బడి కార్యక్రమానికి నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. స్టూడెంట్స్​సంఖ్య ఎక్కువ ఉన్న స్కూళ్లలో మాత్రమే పనులు జరిగాయని డీఈవో వివరించారు. 

మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ పదో తరగతిలో ఆరేళ్లుగా మొదటి రెండు స్థానాల్లో జిల్లాను నిలిపినందుకు అధికారులకు అభినందించారు.  గతంలో లాగానే రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వాలని, మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన బడుల పెయింటింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని, జిల్లా కేంద్రంలో నిర్మించిన మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఉపయోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్యా, విద్యుత్, గ్రామీణ అభివృద్ధి, జిల్లా పంచాయతీ విభాగం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమం తదితర శాఖల పై సమీక్ష నిర్వహించారు. 

సమావేశానికి ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, వంటేరు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ మనుచౌదరి, అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సభ్యుల పదవి కాలం వచ్చేనెలతో ముగుస్తుండడంతో చేసిన పనులను, అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సభ్యులను, జిల్లా పరిషత్ చైర్​పర్సన్​, మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఇతర జిల్లాలు ఈర్ష పడేలా సిద్దిపేట జిల్లా అభివృద్ధి 


ఐదేళ్ల కాలంలో ఇతర జిల్లాలు ఈర్షపడే విధంగా సిద్దిపేట జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేశానని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు. భవిష్యత్​లో ఏ పదవిలో ఉన్నా జిల్లా అభివృద్ధికి అందరం  కృషి చేయాలని సూచించారు. టీచర్ గా కొనసాగుతున్న తనకు అనుకోని విధంగా వచ్చిన అవకాశంతో  సిద్దిపేట జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ గా పనిచేయడం అదృష్టమని అవకాశం కల్పించిన మాజీ సీఎం కేసీఆర్ కు, మాజీ మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా అభివృద్దికి  సంపూర్ణ సహకారం: మంత్రి పొన్నం

సిద్దిపేట జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడుతూ ఐదేళ్ల ప్రజా జీవితంలో గడిపిన జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు అందజేయడానికి చర్యలు తీసుకుంటూనే రైతులకు రుణమాఫీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు. వీటితో పాటు విద్య, వైద్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లకి రూ.1100 కోట్లతో అభివృద్ధి పనులు చేసి మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. సిద్దిపేట జిల్లా అభివృద్ధికి  ఇప్పటి వరకు కృషి చేసినట్టుగానే  భవిష్యత్ లో కూడా కృషి చేస్తానని తెలిపారు.