రైతు ఖుష్ బడ్జెట్.. ఎవుసానికే రూ.72,659 కోట్లు

  • రైతు కూలీలకు ఏటా రూ. 12వేల సాయం.. ఇకపై పంటల బీమా అమలు
  • అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • సంక్షేమానికి, ఆరు గ్యారెంటీలకు సరిపడా నిధులు
  • తొలిసారి విద్యారంగానికి 7 శాతానికి పైగా కేటాయింపులు
  • ఈసారి రూ.21,292 కోట్లు.. గతంతో పోలిస్తే 2వేల కోట్లకు పైగా ఎక్కువ
  • ఇరిగేషన్​కు రూ. 22,301 కోట్లు.. ఇందులో అప్పులకే 9,877 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రైతన్నకు జైకొడ్తూ.. సాగుకు సాతిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దండిగా నిధులు కేటాయించింది. ఎవుసానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్​ను తీసుకొచ్చింది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తున్నామని.. ప్రజా సంక్షేమానికి టాప్​ ప్రయారిటీ ఇస్తున్నామని ప్రకటించింది. బడ్జెట్ అంటే కేవలం అంకెల సమాహారం కాదని.. అది మన విలువలు, ఆశల వ్యక్తీకరణ అని పేర్కొంది. 

2024–25 ఆర్థిక సంవత్సర ఫుల్​ బడ్జెట్​ను గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రైతులకు, రైతు కూలీలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాగేటి సాళ్లల్ల నిధుల వరద పారించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇది. మొత్తం రూ.2.91 లక్షల కోట్ల ఈ భారీ బడ్జెట్​లో ఏకంగా 25 శాతం నిధులను వ్యవసాయానికే కేటాయించారు. 

రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా, రైతు బీమా, సన్నవడ్లకు బోనస్​, విద్యుత్​ సబ్సిడీ ఇలా వివిధ కేటగిరీల్లో మొత్తంగా వ్యవసాయానికి రూ.72,659 కోట్లు ప్రతిపాదించారు.  ‘‘ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరుగాలం శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు. సమాజానికి అన్నంపెట్టే రైతన్నకు భరోసా కల్పించడం మా ప్రభుత్వ కనీస బాధ్యత” అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. భూమిలేని రైతు కూలీలకు ఈ ఏడాది నుంచే ఏటా రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. 

సాగుకే కాదు సంక్షేమానికీ సమపాళ్లలో నిధులను బడ్జెట్​లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆరు గ్యారంటీలకూ సరిపడా ఫండ్స్​ కేటాయించింది. ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, రాజీవ్​ ఆరోగ్య శ్రీ,  రూ.500కే గ్యాస్​ సిలిండర్​లాంటి స్కీములకు ఏకంగా రూ.47,167 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అనే నినాదంతో కొత్తగా ఇంటర్నేషనల్​ స్కూల్స్​తో పాటు ఇంటిగ్రేటెడ్​ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. 

పదేండ్లలో నిధులు, నిర్వహణ లేక మిణుకుమిణుకుమంటున్న ప్రభుత్వ యూనివర్సిటీలకు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపింది. త్వరలో ప్రతి ఒక్కరి డిజిటల్​ హెల్త్​ ప్రొఫైల్​ కార్డులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 11,468 కోట్లు కేటాయించింది.  ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి రెట్టింపు నిధులు అలకేట్​ చేసింది. ఎస్సీ, ఎస్టీల సబ్​ ప్లాన్​లకు దాదాపు రూ.50,180 కోట్లు ప్రతిపాదించింది. 

మహిళలకు వెన్నుదన్నుగా ఉంటామని.. వారి కోసం వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా సౌకర్యం, తెలంగాణ మహిళా శక్తి స్కీమ్​లు తెస్తున్నామని వెల్లడించింది.  గ్రేటర్ హైదరాబాద్​ అభివృద్ధి కోసం రూ. 10 వేల కోట్లు ప్రతిపాదించింది. మెట్రో విస్తరణ, మూసీ డెవలప్​మెంట్​లాంటి కీలక ప్రాజెక్టులకూ ఫండ్స్​ కేటాయించింది. త్వరలోనే నిజాం షుగర్స్​ లిమిటెడ్​ను తిరిగి ప్రారంభిస్తామని ప్రభుత్వం బడ్జెట్​లో ప్రకటించింది. 

యువత బతుకులను ఛిద్రం చేస్తున్న డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపుతామని తెలిపింది.  బడ్జెట్​లో అత్యధికంగా వ్యవసాయ శాఖకు ప్రభుత్వం రూ.49,383 కోట్లు.. ఆ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు  రూ.29,816 కోట్లు ప్రతిపాదించింది.  రూ.17,942 కోట్లతో పాఠశాల విద్య మూడోస్థానంలో నిలిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు గతంలో కన్నా ఎక్కువ నిధులు కేటాయించింది.  సంక్షేమ శాఖల్లో  సబ్సిడీ ఉపాధి స్కీముల అమలుకు పెద్దమొత్తంలో నిధులు ప్రతిపాదించారు.