టెలికామ్​ సంస్థల అప్పు రూ. 4.09 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: 2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని నాలుగు ప్రధాన టెలికాం ఆపరేటర్ల మొత్తం అప్పు రూ. 4,09,905 కోట్లకు చేరింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్​ఎన్​ఎల్​కు​ అతి తక్కువగా  రూ.23,297 కోట్ల అప్పు మాత్రమే ఉందని బుధవారం కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది.  

సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభకు ఇచ్చిన సమాచారం ప్రకారం, 2024 మార్చి 31 నాటికి వొడాఫోన్ ఐడియాకు రూ. 2.07 లక్షల కోట్లు, భారతీ ఎయిర్‌టెల్​కు రూ. 1.25 లక్షల కోట్లు  జియో ఇన్ఫోకామ్​కు రూ. 52,740 కోట్ల అప్పులు ఉన్నాయి.   

బీఎస్​ఎన్​ఎల్​కు​ 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 40,400 కోట్ల అప్పు ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయంతో ఇది రూ.28,092 కోట్లకు తగ్గింది.  మొత్తం రూ.89 వేల కోట్ల కేటాయింపుతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ/5జీ స్పెక్ట్రమ్ కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చంద్రశేఖర్​ తెలిపారు.