మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జన్మభూమినగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కాగజ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ చేయకపోవడంతోనే పేషెంట్ చనిపోయాడని, ఒక్క రోజుకే రూ.4.50 లక్షల బిల్లు వేశారని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన కొంగ శ్రీనివాస్‌కు మంగళవారం సాయంత్రం ఛాతీలో నొప్పి రావడంతో, మంచిర్యాలలోని టచ్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అతడికి హార్ట్ఎటాక్ వచ్చిందని, అర్జంట్‌గా స్టంట్స్ వేయాలని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.లక్షన్నర కట్టించుకున్నారు. ట్రీట్మెంట్ ప్రారంభించిన గంటలోనే శ్రీనివాస్ చనిపోయాడు. బుధవారం ఉదయం రూ.4.50 లక్షలు బిల్ అయిందని, అడ్వాన్స్ పోను మిగిలిన రూ.3 లక్షలు చెల్లించి బాడీని తీసుకెళ్లాలని ఆసుపత్రి నిర్వాహకులు చెప్పారు.
ఒక్కరోజుకే రూ.4.50 లక్షలు బిల్లు వేశారంటూ కుటుంబీకులు హాస్పిటల్ఎదుట ఆందోళనకు దిగడంతో బాడీని అప్పగించారు. ఈ విషయమై టచ్ హాస్పిటల్నిర్వాహకుడు శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. పేషెంట్కండీషన్ సీరియస్‌గా ఉండడంతో నాలుగు స్టంట్స్ పడే చాన్స్ ఉందని, ట్రీట్మెంట్సమయంలో ఏమైనా జరగవచ్చని, బిల్లు గురించి కుటుంబీకులకు ముందుగానే చెప్పామన్నారు. పేషెంట్చనిపోవడంతో స్టంట్స్ ఖర్చు మాత్రమే చెల్లించమన్నామని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదని వివరాణ ఇచ్చారు.
నాగర్‌కర్నూల్‌లో గర్భిణి..
డాక్టర్ నిర్లక్ష్యంతో గర్భిణి చనిపోయిందని ఆరోపిస్తూ బుధవారం ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం ఆలేరుకు చెందిన రాములమ్మ(25) ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. బుధవారం తిమ్మిర్లు రావడంతో వైద్యం చేయించుకోవడానికి భర్త మల్లేశ్తో కలిసి నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ పరీక్షలు చేసి తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయని, మరో హాస్పిటల్ కు పంపించారు. అక్కడి డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, దానిని నియంత్రించడానికి దాదాపు రెండు గంటలు వైద్యం చేశాడు.
సాయంత్రం గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొల్లాపూర్ చౌరస్తాలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన వెంటనే చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి గతంలో మూడు కాన్పులు కాగా, ఇద్దరు శిశువులు చనిపోయారు. ప్రస్తుతం ఒక కొడుకు ఉన్నాడు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే గర్భిణి చనిపోయిందని ఆరోపిస్తూ బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద, ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి సీఐ కనకయ్య చేరుకొని బాధిత కుటుంబంతో మాట్లాడారు. తమకు ఫిర్యాదు చేస్తే డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.