టెండర్ ధాన్యం, సీఎంఆర్ ఇచ్చేందుకు సిద్ధం : కొమురవెల్లి చంద్రశేఖర్

సిద్దిపేట రూరల్, వెలుగు: గతేడాది యాసంగి కి  సంబంధించి లక్ష 75వేల మెట్రిక్ టన్నుల టెండర్ ధాన్యం, ఈ ఏడాది యాసంగి కి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వడానికి మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమురవెల్లి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆఫీస్ లో బుధవారం  ఆయన మీడియాతో మాట్లాడారు.  కరోనా కంటే ముందు మిల్లర్లకు అప్పజెప్పిన ధాన్యం మరాడించి ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు.  

అనంతరం 2021-–22లో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో మిల్లుల కెపాసిటి కి మించి ధాన్యం దిగుమతి చేసినట్లు తెలిపారు. అప్పటి రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాల మధ్య సఖ్యతలేని కారణంగా, దీనికి తోడు మరాడించిన బియ్యం దింపుకోవడానికి  ప్రభుత్వం వద్ద సరైన స్థలం లేక మిల్లర్ల వద్దే ఆ బియ్యం ఉండిపోయిందన్నారు. స్థలాభావం కారణంగా రబీ సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ దిగుమతి కోసం ఒక్కొక్క లారీ 3రోజుల పాటు వేచిఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. 

జిల్లా పరిధిలో సుమారు 150 మిల్లులకు సంబంధించి రూ.100 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 2023 యాసంగి సంబంధించి టెండర్ ధాన్యం నిల్వ ఉంచిన నేపథ్యంలో తరుగు, హమాలీ, గోదాం కిరాయి కలుపుకొని క్వింటాల్ కు రూ.5వందలు మిల్లర్లుకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.  సమావేశంలో సెక్రటరీ బుచ్చయ్య, వైస్ ప్రెసిడెంట్ బాలకిషన్ రావు, జాయింట్ సెక్రటరీ శివకుమార్, మాజీ కోశాధికారి ఉప్పల భూపతి, అడ్వైజర్ కాశీనాథ్, మిల్లర్ మద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు.