సిద్దిపేట, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ తో పాటు కేసీఆర్ కూడా జైలుకెళ్లడం ఖాయమని దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ కాంగ్రెస్ ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో మెదక్కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర ఖజానాను ఖాళీచేసి, ప్రజల సొమ్మును యథేచ్చగా దోచుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
బీజేపీ కేవలం అదానీ, అంబానీ ఆదాయాల్ని పెంచడానికే పనిచేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ గ్యారంటీగా అమలు చేస్తుందని, ఆగస్టు 15న స్పీకర్ ఫార్మట్ లో హరీశ్‌రావు రాజీనామాతో వస్తే మంచిదని హితవు పలికారు. నీలం మధు మాట్లాడుతూ బీసీ బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. బీజేఆర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్, సుభాష్ రోడ్డు, లాల్ కమాన్, మెయిన్ రోడ్డు, గాంధీ చౌక్, భారత్ నగర్ మీదుగా సాగింది. ఈ ర్యాలీలో పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పూజల హరికృష్ణ పాల్గొన్నారు.