- రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర.. అందుకే 400 సీట్లు కావాలంటున్నడు: రేవంత్
- బిడ్డ బెయిల్ కోసమే బీజేపీకి కేసీఆర్ మద్దతు
- మెదక్ జిల్లా పెద్దశంకరంపేట జనజాతర సభలో సీఎం స్పీచ్
పెద్దశంకరంపేట/మెదక్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా గెలిచి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆయన కుట్ర చేస్తున్నారని, అందుకే 400 ఎంపీ సీట్లు కావాలంటున్నారని ఆరోపించారు. ‘‘రిజర్వేషన్లు పోవాలంటే బీజేపీకి ఓటేయండి. రిజర్వేషన్లు కొనసాగి ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి” అని ఆయన పిలుపునిచ్చారు. జహీరాబాద్లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం రాత్రి జరిగిన జన జాతర సభలో రేవంత్ మాట్లాడారు. 75 ఏండ్ల తర్వాత గుజరాత్ నుంచి నరేంద్ర మోదీ, అమిత్ షా బయలు దేరారని, ‘మేమిద్దరం మాకిద్దరూ’ అన్నట్టు వాళ్లకు అదానీ, అంబానీ తోడయ్యారన్నారు. ఈ నలుగురి ఆలోచన ఒక్కటేనన్నారు.
హక్కులు, అధికారంలో భాగం అడుగుతారనే.. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వాళ్లు బ్రిటిష్ వాళ్ల మాదిరిగా తయారయ్యారని.. ఇప్పుడు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు. మతాలు, జాతులు, భాషల పేరుతో మనుషుల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని దోచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. రైతులను అదానీ, అంబానీలకు బానిసలుగా చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులను తమ భూముల్లో తామే కట్టు బానిసలుగా మారేలా చేసేందుకే నల్ల (అగ్రి) చట్టాలు తెచ్చారన్నారు. కానీ హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ మీద దండయాత్ర చేసి16 నెలలు మండుటెండల్లో నిటారుగా నిలబడి కొట్లాడటంతో.. ఆ చట్టాలను ఉపసంహరించుకుని రైతులకు మోదీ క్షమాపణలు చెప్పారన్నారు.
ఆయన బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్
బీజేపీ, బీఆర్ఎస్ మాట్లాడుకొని గూడుపుఠాణి చేశాయని, కేసీఆర్కు చెప్పే బీబీ పాటిల్ బీజేపీలో చేరారని రేవంత్ రెడ్డి అన్నారు. బిడ్డకు బెయిల్ రావాలంటే జహీరాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీని గెలిపించాలని ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అంగీ, టోపీ మారింది కానీ బీబీ పాటిల్ బుద్ధి మారలేదన్నారు. ఆయన ముఖానికి మసి పూసుకొని వచ్చినా బిజినెస్ పాటిల్ అని జనం గుర్తు పడతారన్నారు. ‘‘బీబీ పాటిల్ పదేండ్లు మీ ఎంపీగా ఉండి లోక్సభలో మీ సమస్యల గురించి ఒక్కనాడైనా మాట్లాడారా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బీసీల జనాభా లెక్కలు తేల్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. తెలంగాణ పదేండ్లపాటు కల్వకుంట కుటుంబ పాలనలో బందీ అయిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తెలంగాణ దొరల గడీని బద్దలుకొట్టి రాష్ట్రానికి స్వేచ్ఛను ప్రసాదించారన్నారు. తాము100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నామన్నారు. నీతి, నిజాయతీ ఉన్న సురేశ్ షెట్కార్ను జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలన్నారు.