ఎస్సీ వర్గీకరణ రద్దు చేసేవరకు ఉద్యమిస్తాం : రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్

లోకేశ్వరం/కుంటాల వెలుగు: ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర బౌద్ధమహాసభ అధ్యక్షుడు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్ గడపాలే నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమాలు ఆపేదే లేదన్నారు. మంగళవారం లోకేశ్వరం మండలానికి చెందిన బహుజన అంబేద్కర్ వారసులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం తహసీల్దార్ మోతిరాంకు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులను రద్దు చేసేవరకు ఉద్యమిస్తామని ప్రభాకర్​అన్నారు. ముథోల్ ఎస్సీ వర్గీకరణ అధ్యక్షుడు భీంరావు డోంగ్రే, ఉపాధ్యక్షుడు గౌరోళ్ల దిగంబర్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాంబ్లే  విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆరోపించింది. మంగళవారం కుంటాల మండల కేంద్రంలో శాంతీయుత ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.     
                                                                  
బంద్​ను​ సక్సెస్​ చేయాలి కోల్​బెల్ట్: ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం చేపట్టనున్న భారత్​ బంద్​ను మంచిర్యాల జిల్లాలో విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి లీడర్లు పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  భారత్ బంద్ విజయవంతానికి ఆర్టీసీ, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు మద్దతు పలకాలని కోరారు.