మెదక్ టౌన్, వెలుగు: డంప్ యార్డ్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగతో మెదక్ పట్టణ వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పట్టణ శివారులోని డంప్ యార్డ్ లో పెద్ద మొత్తంలో పోగైన చెత్త మంగళవారం తగులబడింది. దీంతో మున్సిపల్ అధికారులు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పారు. అయినప్పటికీ బుధవారం డంప్ యార్డ్ లో తగుల బడిన చెత్త కుప్పల నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి.
రాత్రి అయ్యే సరికి పొగలు పట్టణంలోకి వ్యాపించాయి. ప్రధానంగా తారక రామనగర్ కాలనీ, ఇందిరా పూరికాలనీ, మిలట్రీ కాలనీ తదితర కాలనీలు పొగ మయమయ్యాయి. ఘాటైన వాసనతో ఉన్న పొగ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు.