- గజ్వేల్‌లో అధికారులను అడ్డుకున్న మల్లన్నసాగర్ నిర్వాసితులు
గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను సర్వే చేసేందుకు వచ్చిన ఆఫీసర్లను మల్లన్నసాగర్ నిర్వాసితులు అడ్డుకున్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను ఖాళీ చేయించే టైంలో ప్లాట్లు, ప్యాకేజీ తీసుకుని సొంతంగా ఇండ్లు నిర్మించుకుంటామని చెప్పిన వారిని తాత్కాలికంగా గజ్వేల్‌లోని డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉంచారు. ఇందులో కొందరు డబుల్ ఇండ్లు ఖాళీ చేసి వెళ్లగా మరికొందరు అక్కడే ఉంటున్నారు. మరో వైపు ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించిన లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు.
వారు తమకు ఇండ్లు అప్పగించాలని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో డబుల్ ఇండ్లలో ఎంత మంది నిర్వాసితులు ఉంటున్నారో తెలుసుకునేందుకు రెవెన్యూ ఆఫీసర్లు సోమవారం డబుల్ ఇండ్ల వద్దకు వెళ్లారు. ఆఫీసర్లు వచ్చిన విషయం తెలుసుకున్న నిర్వాసితులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ప్యాకేజీ అందలేదని, ఇతర హామీలు అమలు కాకపోవడంతో తాము డబుల్ ఇండ్లు ఖాళీ చేసేది లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో ఆఫీసర్లు అక్కడి నుంచి వెనుదిరిగారు.