- బోనమెత్తిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రేణుకాఎల్లమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఈరగోల దెబ్బలు, జమిడిక మోతలతో ఆలయం మార్మోగింది. అన్న ప్రసాదాలు, ఎడ్లబండ్లు, ఊరేగింపులు, శివసత్తుల సద్దులు, ఒడిబియ్యాలతో ప్రజలు అమ్మవారికి మొక్కుకున్నారు. పట్నాలు వేసి, బోనాలు సమర్పించి, కోళ్లు, మేకలను బలి ఇచ్చి, కల్లు సాక, బెల్లం పానకంతో అమ్మవారిని కొలుసుకున్నారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనం ఎత్తి డప్పుచప్పళ్లతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కిషన్ రావు మంత్రికి మర్యాదపూర్వకంగా స్వాగతంపలికారు.