తిమ్మాపూర్, వెలుగు: జనవరి 1 నుంచి మార్చి 31 వరకు యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ఎల్ఎండీలో 23.735 టీఎంసీలు, శ్రీరాజరాజేశ్వర(ఎంఎంఆర్)లో 26.73 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. రెండు ప్రాజెక్టుల నుంచి 25 టీఎంసీలు, ఎస్సారెస్పీ నుంచి 5 టీఎంసీలతో కలిపి 30 టీఎంసీల నీటిని తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించనున్నట్లు చెప్పారు.
కాకతీయ కెనాల్ ప్రధాన కాలువ ద్వారా నిరంతరంగా నీటిని వదులుతూ, డిస్ట్రిబ్యూటరీలకు మాత్రం ఆన్,ఆఫ్ పద్ధతిలో విడుదల చేస్తామన్నారు. ఎల్ఎండీ దిగువన స్టేజ్-1లో 146 కిలోమీటర్ నుంచి 284 కిలోమీటర్మహబూబాబాద్ వరకు ఒక విడతగా 8 రోజులు, స్టేజ్-2లో 284 కిలోమీటర్ నుంచి 349 కిలోమీటర్ సూర్యాపేట వరకు 7 రోజులు మరో విడతలో నీటిని వదలనున్నట్లు చెప్పారు.
కాలువ మొత్తంలో 71 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా.. స్టేజ్--1 కింద 5 లక్షల ఎకరాలు, స్టేజ్-2 కింద 4 లక్షల ఎకరాలకు నీటిని వదులుతామని తెలిపారు.