- వందలాది క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత
- ఇతర రాష్ట్రాలకు తరలింపు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : ఇటీవల పీడీఎస్ రైస్ (రేషన్ బియ్యం) పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న సంఘటనలు ఉమ్మడి మెదక్ జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ దాడుల్లో అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్ లోని శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని రమేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ విధానం ద్వారా పేదలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైకిలింగ్ చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్అధికారులు గుర్తించారు.
ఈ నెల 16న దాడి చేసి నాలుగు వాహనాల్లో ఉన్న 540 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పీడీఎస్ రైస్విలువ రూ.10.80 లక్షలు ఉంటుంది. గత నెలలో రామాయంపేట పట్టణ పట్టణ శివారులో నేషనల్ హైవే పై వాహనాలను తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి గుజరాత్ కు వెళుతున్న లారీలో 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో హైదరాబాద్ నుంచి నాగపూర్ తరలిస్తున్న లారీలో 28 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. మరో ఆటోలో18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకొని సీజ్ చేశారు. మరో రోజు తూప్రాన్ పట్టణ పరిధి నేషనల్ హైవే 44 పైన వాహన తనిఖీలో 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో గత పది రోజుల్లో పోలీసులు 62 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టుకున్నారు. ఈనెల 12న మిరుదొడ్డి చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా 10 క్వింటాళ్ల పీడీఎస్ రైస్పట్టుబడింది. ఈనెల 20న సిద్దిపేట పట్టణం నుంచి బొలెరో వాహనంలో అక్రమంగా తీసుకు వెళ్తున్న 41 క్వింటాళ్ల పీడీఎస్ రైస్‌ను త్రీ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. 23న సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్ లో ఓ షాపులో అక్రమంగా నిల్వచేసిన 10 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు పోలీసులు పీడీఎస్ రైస్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ రాత్రివేళ
తెల్లవారుజామున ఆటోలు, చిన్న చిన్న వాహనాల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు రేషన్ షాపులతోపాటు వినియోగదారుల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ రైస్ సేకరించి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. పోలీసు తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కొందరు పీడీఎస్ రైస్‌ను వ్యవసాయ పొలాల వద్ద, పశువుల కొట్టాల్లో, గ్రామ పరిసరాల్లో చిన్న చిన్న గుడిసెల్లో దాచి పెడుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
ఈనెల15న టాస్క్ ఫోర్స్ బృందం, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో బీడీఎల్భానూర్ పీఎస్ పరిధిలోని పాశమైలారం గ్రామంలో అక్రమంగా నడుపుతున్న రైస్ మిల్లును తనిఖీ చేయగా 500 టన్నుల పీడీఎస్ రైస్ పట్టుబడింది. ఈ కేసులో 3 లారీలు, 4 డీసీఎం వ్యాన్లను సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి కొంత కాలంగా ఆ రైస్ మిల్లును నడుపుతూ ప్రభుత్వం నుంచి వడ్లను కొనుగోలు చేసి తన రైస్ మిల్లులో వడ్లను రైస్ గా మార్చి ఎఫ్‌సీఐ గోదాంకు పంపిస్తున్నాడు.
ఇదే అదునుగా భావించిన ప్రభాకర్ రెడ్డి వివిధ ప్రాంతాల నుంచి పీడీఎస్ రైస్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని క్లీన్ చేసి గన్నీ బ్యాగ్ లలో నింపి ఎఫ్‌సీఐ మార్క్ ముద్రించి మిగతా రైస్ తో కలిపి గోదాంకు పంపిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. పీడీఎస్ అక్రమ రవాణాకు ముంబై హైవేను దారిగా చేసుకొని కర్నాటక, మహారాష్ట్రలకు ఎక్కువగా తరలిస్తున్నారు.