భైంసా, వెలుగు: ఆక్రమించుకున్న డబుల్బెడ్రూం ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆర్డీవో కోమల్ రెడ్డి ఆదేశించారు. గురువారం భైంసాలోని డబుల్ బెడ్రూం సముదాయాన్ని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఆ ఇండ్లను పలువురు ఆక్రమించుకున్నట్లుగా గుర్తించి తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించేంత వరకు వాటిల్లో ఎవరూ ఉండకూడదన్నారు. అయితే ఏడాది క్రితం లక్కీ డ్రాలో ఎంపికైన తమకు ఇప్పటి వరకు ఇండ్లు కేటాయించకపోవడం పట్ల పలువురు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఇండ్లు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆర్డీవో ఇండ్ల సముదాయాల్లో అన్ని రకాల వసతులు కల్పించిన తర్వాతే కేటాయిస్తామని వెల్లడించారు.