ఈ బ్యాంకు ఖాతాలు మూసేస్తున్నారు.. మీ ఖాతాల్లో డబ్బులు ఉంటే వెంటనే డ్రా చేసుకోండి

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ అందుతోంది. కొత్త ఏడాది మొదటి రోజే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను ప్రభావితం చేసే కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏళ్ల తరబడి వాడకుండా వదిలేసిన ఖాతాలను, జీరో బ్యాలెన్స్ కదా అని పైసలు ఉంచకుండా మూలాన పడేసిన ఖాతాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. 2025 జనవరి 1 నుంచే ఆర్‌బీఐ దీన్ని అమలులోకి తీసుకురాబోతుంది.

బ్యాంకింగ్ లావాదేవీల భద్రత, పారదర్శకత, బ్యాంకింగ్ పనితీరును పెంపొందించే లక్ష్యంగా మూడు రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. తద్వారా మోసపూరిత కార్యకలాపాలను అరికట్టవచ్చని అపెక్స్ బ్యాంక్ నమ్ముతోంది. మూసేస్తున్న ఆ మూడు రకాల ఖాతాలు ఏవనేది తెలుసుకొని.. ఆయా అకౌంట్లలో మీ డబ్బులుంటే డ్రా చేసుకోగలరని మనవి. 

డోర్మాంట్ అకౌంట్స్

డోర్మాంట్ ఖాతా అంటే.. రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని అకౌంట్లు. మోసపూరిత కార్యకలాపాల కోసం హ్యాకర్లు.. ఇలాంటి ఖాతాలను  లక్ష్యంగా చేసుకుని తమ అసాంఘిక కార్యకలాపాలను సాగిస్తుంటారు. అందువల్ల డార్మాంట్ అకౌంట్లను క్లోజ్ చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

ఇనాక్టివ్ అకౌంట్స్

ఇనాక్టివ్ ఖాతాలు అంటే నిర్దిష్ట వ్యవధిలో (సాధారణంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) లావాదేవీ కార్యకలాపాలు అకౌంట్లు. ఖాతాల భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను మూసేయాలని ఆర్​బీఐ నిర్ణయించింది. ఒకవేళ మీకూ ఇలాంటి ఇనాక్టివ్ అకౌంట్‌ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవడం మంచిది. ఒకసారి మూసేశాక బ్యాంకుకెళ్లి అయ్యో నా డబ్బని లబోదిబోమని ఎంత మొత్తుకున్నా చిల్లిగవ్వ తిరిగి రాదు.

జీరో బ్యాలెన్స్ ఖాతాలు

ఎక్కువ కాలం జీరో బ్యాలెన్స్‌ని కొనసాగించే ఖాతాలు కూడా మూసివేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇలాంటి ఖాతాలు బోలెడు ఉన్నాయి. నాలుగైదేసి అకౌంట్లు తెరవడం.. అవసరం లేని వాటిలో డబ్బులు ఉంచకుండా మూలన పడేయటం అందరూ చేసే పని. అటువంటి ఖాతాలన్నీ మూతపడనున్నాయి. ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆర్థిక నష్టాలను తగ్గించడం, కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

మీ అకౌంట్ మూత పడకూడదు అంటే, వెంటనే ఈ పని చేయండి

ఒకవేళ మీ ఖాతా ఇనాక్టివ్‌గా ఉన్నా, రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపక డోర్మాంట్ స్థితిలో ఉన్నా వెంటనే యాక్టివేట్ చేసుకోండి. అందుకోసం మీరు వెంటనే కేవైసీ(KYC)ని పూర్తి చేయాలి. మీ ఆధార్, పాన్ వివరాలు బ్యాంక్ సిబ్బందికి అందజేసి మీ కేవైసీని అప్డేట్ చేసుకోండి. అలా చేస్తే మీ బ్యాంకు ఖాతా ఇనాక్టివ్‌గా మారకుండా ఉంటుంది. అలాగే బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్​అనేది మెయింటెన్ చేయండి. లేదంటే అవి ఇనాక్టివ్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు.