ఆర్నెళ్లలో 18 వేల బ్యాంక్ మోసాలు..రూ.21,367 కోట్ల నష్టం

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌‌–సెప్టెంబర్ మధ్య రూ.21,367 కోట్ల విలువైన 18,461  బ్యాంక్ మోసాలు జరిగాయని  ఆర్‌‌‌‌బీఐ ప్రకటించింది. కిందటేడాది ఇదే టైమ్‌‌లో రూ.2,623 కోట్ల విలువైన 14,480 మోసాలు జరగగా,  దీంతో  పోలిస్తే  ఎనిమిది రెట్ల ఎక్కువ అమౌంట్‌‌ను ప్రజలు మోసపోయారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ సెక్టార్‌‌‌‌ ఎలా ఉందో వివరిస్తూ ఓ రిపోర్ట్‌‌ను ఆర్‌‌‌‌బీఐ విడుదల చేసింది. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో  కమర్షియల్ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీల పనితీరును గురించి తెలియజేసింది.

ఆర్‌‌‌‌బీఐ రిపోర్ట్ ప్రకారం, 2023–24 మొత్తంలో  జరిగిన బ్యాంక్ మోసాలు గత 16 ఏళ్లలోనే తక్కువ.  ఆన్‌‌లైన్‌‌, కార్డు మోసాలు ఎక్కువగా జరిగాయి. వీటి వాటా 2023–24 లో  జరిగిన బ్యాంకు మోసాల సంఖ్యలో 44.7 శాతంగా, మోసపోయిన అమౌంట్‌‌లో 85.3 శాతంగా ఉన్నాయి.  2023–24 లో జరిగిన బ్యాంకు ఫ్రాడ్స్‌‌లో  67.1 శాతం కేసులను   ప్రైవేట్ బ్యాంకులు రిపోర్ట్ చేయగా,  ప్రభుత్వ బ్యాంకులు మాత్రం ఇంటర్నెట్‌‌,  కార్డు మోసాలను ఎక్కువగా ఎదుర్కొన్నాయి.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు మినహా మిగిలిన బ్యాంకులపై వేసే పెనాల్టీలు కిందటి ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి. రెగ్యులేటరీ సంస్థలు బ్యాంకులపై వేసే పెనాల్టీల విలువ రూ.86.1 కోట్లకు చేరుకుంది. కోఆపరేటివ్ బ్యాంకులపై వేసిన పెనాల్టీలు మాత్రం తగ్గాయి.