గొలుసుకట్టు చెరువుల రక్షణకు కార్యాచరణ

  • బీజేపీ ఆధ్వర్యంలో చెరువుకు దరువు-వరదకు అడ్డు కార్యక్రమం
  • నేటి నుంచి చెరువుల సందర్శన

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువుల భూముల పరిరక్షణకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ పార్టీ ఆధ్వర్యంలో ‘చెరువుకు దరువు–వరదకు అడ్డు’ కార్యక్రమం రూపొందించారు. ఈ మేరకు బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ సీనియర్ నేతలంతా సమావేశమై చర్చించారు. కొంత కాలంగా నిర్మల్ లోని గొలుసు కట్టు చెరువు భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతున్నాయని.. ఫలితంగా చెరువులు కుంచించుకుపోతుండడంతో వర్షాకాలంలో వరదల కారణంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయని పేర్కొన్నారు.

ఆక్రమణలను అడ్డుకోవాలని, గురువారం నుంచి చెరువుల సందర్శనకు సిద్ధం కావాలని బీజేపీ లోక్ సభ ఇన్ చార్జి అయనగారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జి రావుల రామనాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 15 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగించాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసిమ రాజు, టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్, ఆడెపు సుధాకర్, అలివేలు మంగ, విలాస్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.