జనవరి 31 వరకు ఆపరేషన్ ​స్మైల్ : ఎం.శ్రీనివాస్​

  • ప్రతి అధికారి ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయాలి

మంచిర్యాల, వెలుగు: పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు ఆపరేషన్ స్మైల్–11 నిర్వహించనున్నట్టు రామగుండం పోలీస్​ కమిషనర్ ​ఎం.శ్రీనివాస్​తెలిపారు. గురువారం కమిషనరేట్​ హెడ్ ​క్వార్టర్స్​లో పోలీసు అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆపరేషన్ స్మైల్​లో అందరూ పాలుపంచుకోవాలని, ఒక్కో అధికారి ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయాలని సూచించారు. వివిధ కారణాలతో కుటుంబానికి దూరమైన పిల్లలను కొంతమంది పనిలో పెట్టుకొని ప్రమాదకరమైన పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు.  అలాంటి బాలలను గుర్తించి ‘దర్పణ్’ అప్లికేషన్​లో నమోదు చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని సూచించారు. బాలల గురించి సమాచారం తెలిసినవారు చైల్డ్ హెల్ప్ లైన్ 1098,112 నంబర్లకు కాల్​ చేయాలన్నారు. 

కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి: ఎస్పీ 

ఆసిఫాబాద్, వెలుగు: ఆపరేషన్ స్మైల్–11 కార్యక్ర మాన్ని సక్సెస్ చేయాలని ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కోరారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను రక్షించి వారికి పునరావాసం కల్పించేందుకు చేపడుతున్న ఆపరేషన్ స్మైల్​ను విజయవంతం చేయాలని కోరారు. 

ఈనెల 1 నుంచి 31 వరకు నిర్వహించే కార్యక్రమం కోసం పోలీసు, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, కార్మిక, విద్య, ఆరోగ్య శాఖలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఎన్ జీవో, అధికారులతో కలిసి జిల్లా వ్యాప్తంగా రెండు సబ్ డివిజన్లలో రెండు టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. పనితీరు కనబరిచిన సిబ్బందికి ప్రశంశాపత్రాలు అందజేస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్ రావు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మహేశ్, డీఎంహెచ్​వో సీతారాం, డీఈవో యాదయ్య తదిత రులు పాల్గొన్నారు.