న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : పోలీస్ కమిషనర్​ ఎం.శ్రీనివాస్

 

  • అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చర్యలు
  • హెచ్చరించిన పోలీస్​ అధికారులు

నెట్​వర్క్, వెలుగు: న్యూ ఇయర్ ​వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్​ ఎం.శ్రీనివాస్​ కోరారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలకు దూరంగా జరుపుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి స్పెషల్​ డ్రంక్​ అండ్ ​డ్రైవ్ ​తనిఖీలు నిర్వహిస్తామని, పట్టుబడిన వారిపై కేసులు నమోదుచేసి బైండోవర్​ చేస్తామన్నారు.

రాత్రి 12.30 గంటల లోపు వేడుకలు ముగించాలని, సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వాహకులు పోలీసుల పర్మిషన్​ తీసుకోవాలని, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో డీజేలు, మైకులు పెట్టరాదని, పటాకులు కాల్చరాదని అన్నారు. వైన్స్​, బార్లు ప్రభుత్వం అనుమతించిన టైమ్​కు క్లోజ్​ చేయాలన్నారు.

 డ్రగ్స్​కు దూరంగా ఉండాలి: ఎస్పీ

న్యూ ఇయర్ వేడుకలు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని, యువత డ్రగ్స్​కు దూరంగా ఉండి వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని ఆదిలాబాద్​ ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. సోమవారం ఎస్పీ ఛాంబర్​లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో పాటు 30 ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యువత మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు

న్యూఇయర్​ వేడుకల్లో రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్​ఎస్పీ డీవీ శ్రీనివాస రావు హెచ్చరించారు. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే ఉపేక్షించబోమన్నారు. వేడుకలు రాత్రి 12.30 గంటల వరకు పూర్తిచేసుకోవాల న్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, ర్యాష్​డ్రైవింగ్​కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామ న్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ప్రజలు డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.

మందమర్రి సర్కిల్​లోని మందమర్రి, రామకృష్ణాపూర్, కాసీపేట, దేవాపూర్ ​పోలీస్​ స్టేషన్ల పరిధిలో డిసెంబర్ 31న విస్తృతంగా డ్రంక్ అండ్ ​డ్రైవ్​ చేపడుతామని  సీఐ శశిధర్ ​రెడ్డి తెలిపారు. వేడుకల సందర్భంగా డీజీలు, అధిక సౌండ్​వచ్చే బాక్స్​ను వినియోగిస్తే ఊపేక్షించేదిలేదన్నారు. న్యూ ఇయర్​ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని, ఎవరికీ ఇబ్బంది కలిగించవద్దని జన్నారం ఎస్ఐ రాజవర్దన్,  దండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.