బీఆర్ఎస్​లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు: రఘునందన్ రావు

సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్​లో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేదని, సూట్ కేసులు ఇచ్చేవారికి టికెట్లిచ్చి ఎన్నికల బరిలోకి దింపుతున్నారని మెదక్  బీజేపీ అభ్యర్థి రఘునందన్  రావు అన్నారు. శనివారం సిద్దిపేటలో బీజేపీ నేతలు బైక్  ర్యాలీ నిర్వహించారు. అనంతరం  రఘునందన్  మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పేరిట మాజీ మంత్రి హరీశ్ రావు దోచుకున్న డబ్బుతో సిద్దిపేటను పాలిస్తున్నారని  విమర్శించారు. ‘‘రంగనాయక సాగర్ వద్ద ఫామ్ హౌస్​ కట్టుకొని జల్సాలు చేసే హరీశ్ రావుకి సొంత ఊరుకెళ్లి ఓటు వేసే దమ్ము, ధైర్యం లేదు. 

దుబ్బాకలో చెల్లని రఘునందన్.. మెదక్​లో ఎలా చెల్లుతారని కేసీఆర్​ అంటున్నారు. మరి కామారెడ్డిలో బీజేపీ చేతిలో ఓడిన కేసీఆర్..​ ఏ  ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు? అటు ఢిల్లీలో ఇటు గల్లీలో లేని బీఆర్ఎస్ కు ఓటు ఎందుకు వేయాలి?” అని రఘునందన్  ప్రశ్నించారు. తనను దుబ్బాకలో ఓడించేందుకు హరీశ్ రావు పోలీసుల ద్వారా డబ్బులు పంచారని ఆయన ఆరోపించారు.