మెదక్: రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ లను మీడియాలో రాకుండా చేసి హరీశ్ రావు కొత్త పార్టీ పెడతాడని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్ ఆడుతున్న నాటకాలను కేటీఆర్ గమనించడం లేదన్నారు. మీడియా, ప్రజల దృష్టి మళ్లించడం కోసం హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు.
మార్చి 19న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తూ రేవంత్ రెడ్డి, హరీశ్ రావు విమానంలో చర్చలు జరిపారని చెప్పారు. 'నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చెయ్' అంటూ ఇద్దరు వాదులాడుకున్నారన్నారు. హరీశ్ రావు మాటలకు తప్ప చేతులకు పనికిరాడని, 10 ఏండ్లలో లక్ష రూపాయల రుణమాఫీ చేయనందుకు గన్ పార్క్ వద్ద హరీశ్ ముక్కు నేలకు రాయాలన్నారు.
మీడియాలో హైలెట్ కావడం కోసమే ఆయన మాటలు చెబుతారన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై బీజేపీపి ఓడించాలని చూస్తున్నాయని ఆరోపించారు.