నాకు గడీ ఎక్కడుందో చెప్తే రేవంత్​రెడ్డికే రాసిస్తా : రఘునందన్​రావు

  • సిద్దిపేటలో హరీశ్​రావు కంటే నేనే బలవంతుడిని
  • పార్లమెంట్ ​ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఒక్క సీటు కూడా గెలువదని వ్యాఖ్య

మెదక్, వెలుగు: తనకు గడీ ఎక్కడుందో చెప్తే.. దాన్ని సీఎం రేవంత్​రెడ్డికే రాసిచ్చేందుకు సిద్ధమని బీజేపీ మెదక్​ ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావు అన్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు వచ్చిన రేవంత్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని చెప్పారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర నేతలు కిశోర్ పోరెడ్డి, విజయ్ కుమార్, నర్సింగ్ గౌడ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. 

కేంద్ర ప్రభుత్వం మెదక్​కు ఏం చేసిందంటూ సీఎం మాట్లాడారని, దీంతో 2014 – 2024  వరకు మెదక్​కు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందనే వివరాలను సేకరించినట్టు చెప్పారు. వీటితో బుక్​ రూపొందించి, సీఎం రేవంత్ రెడ్డికి పంపిస్తున్నట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో ఉన్న పల్లె ప్రకృతి వనానికి రూ.4.23 లక్షల చొప్పున, వైకుంఠధామాలకు రూ.11.13 లక్షలు, డంప్ యార్డులకు రూ.2.5 లక్షల చొప్పున కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. ఒక్క దుబ్బాక స్థానంలోనే ఉపాధి కూలీలకు రూ.230 కోట్ల నిధులు ఇచ్చినట్టు వెల్లడించారు. 

సిద్దిపేటలో నేనే బలవంతుడిని

సిద్దిపేటలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు కంటే తానే బలవంతుడినని, ఇది పార్లమెంట్ ఎన్నికల్లో తేలుతుందని రఘునందన్​రావు అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. దేశంలో మోదీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అంటున్న రేవంత్ రెడ్డి.. పదేండ్లలో దేశంలో ఎన్ని మత ఘర్షణలు జరిగాయో చెప్పాలని డిమాండ్​ చేశారు. 

గాంధీభవన్ లో కూర్చొని జగ్గారెడ్డి, నామినేషన్ల దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17న నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీపై ఎమ్మెల్యేలతో కమిటీ వేశారని, ఆ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ అడ్డమొస్తే.. తాను మాట్లాడుతానన్నారు.