జైనూర్, వెలుగు: జైనూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సోమవారం ప్రజా సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మెయిన్ రోడ్డుపై ధర్నా చెప్పట్టారు. ఆదివాసీ జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసి డెంట్ కనక యాదవ్ రావు మాట్లాడుతూ.. ఏజెన్సీ వాసులకు ప్రభుత్వ వైద్యం అందడంలేదన్నారు. జైనూర్ హాస్పిటల్లో 8 మంది డాక్టర్లకు గానూ ఒకరే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
డాక్టర్ల కొరత కారణంగా ప్రజలు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లను నియమించాలని ఇటీవల కలెక్టర్కు వినతిపత్రం అందించినా ఫలితంలేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘం జిల్లా కార్యదర్శి ముండే సతీశ్, ఆదివాసీ సంఘాల నాయకులు ఆత్రం భీంరావు, చాహకటి గణేశ్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.