ఆశ్రమ పాఠశాల స్టూడెంట్లకు మెరుగైన ట్రీట్​మెంట్ అందించండి

  • నిమ్స్ డైరెక్టర్​కు మంత్రులు పొన్నం, కొండా సురేఖ ఆదేశం
  • నిలకడగా ఉందని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన మంత్రులు

ఫుడ్​పాయిజన్​తో నిమ్స్ లో ట్రీట్​మెంట్​పొందుతున్న కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల స్టూడెంట్లను మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డాక్టర్ గంగాధర్​ను అడిగి తెలసుకున్నారు. మెరుగైన ట్రీట్​మెంట్​ అందించాలని డాక్టర్లను  ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని.. ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు మంత్రులు భరోసా ఇచ్చారు. అలాగే, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ నిమ్స్ డైరెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉచితంగా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

నిర్మల్​లో విద్యార్థి మృతి బాధాకరం..

నిర్మల్ లోని బీసీ గురుకులంలో విద్యార్థి మృతి బాధాకరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్‌‌పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన అయాన్ హుస్సేన్ బీసీ గురుకులంలో  9వ తరగతి చదువుతున్నాడు. రోజులాగే మంగళవారం  తెల్లవారుజామున నిద్రలేచి.. గ్రౌండ్‌‌కి వెళ్లిన కాసేపటికే తనకు వణుకు పుడుతోందని పీఈటీకి చెప్పాడు. 

మెడికల్ రూంలోకి తీసుకెళ్లే లోగా అతనికి ఫిట్స్ వచ్చాయని స్కూల్ సిబ్బంది చెప్పారని, వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలిసిందని మంత్రి పేర్కొన్నారు. ఘటనపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అయాన్ హుస్సేన్ కుటుంబానికి రూ.2లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అనారోగ్యం  ఉంటే తల్లిదండ్రులకు సరైన సమాచారం అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

రెసిడెన్సియల్ స్కూల్స్​ను  పట్టించుకోవడం లేదు: హరీశ్ రావు

వాంకిడి ఆశ్రమ పాఠశాలలో 60 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురైతే ఇద్దరు బాలికలనే నిమ్స్ కు తీసుకొచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. మంగళవారం నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆయన పరామర్శించారు. మంచి విద్య  అందుతుందని  తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారని, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు.