మెదక్‌లో మంత్రి Vs​ ఎమ్మెల్యే.. ప్రోటోకాల్ ​లొల్లి

కొల్చారం:  మెదక్​ జిల్లా కొల్చారంలో ఇవాళ  మంత్రి కొండా సురేఖ పర్యటన రసాభాసగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్​కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని   బాహ బాహీకి దారితీసింది.  జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన బడి బాట కార్యక్రమానికి మంత్రి సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. వేదిక మీద స్థానిక ఎంపీటీసీ అరుణకు కుర్చీ వేయలేదని, కానీ ప్రోటోకాల్ లేనివారు స్టేజీ మీద ఉన్నారని ఎమ్మెల్యే సునీతా రెడ్డి అనడంతో వివాదం మొదలైంది. 

స్టేజి మీద నర్సాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే అలా వ్యాఖ్యానించారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్, జడ్పీటీసీ భర్త సంతోష్ కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మాట మాట పెరిగి ఇరువర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు. ఈ సమయంలోనే మంత్రి, ఎమ్మెల్యే ఆదరా బాదరగా  విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్ బుక్స్ పంపిణీ చేసి  అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం కొత్తగా నిర్మించిన ఎంపీడీ వో ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి  వెంట రాజిరెడ్డి ఉండటంపై ఎమ్మెల్యే సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

 కాగా మంత్రి మనం తరువాత మాట్లాడుకుందాం అంటూ రిబ్బన్ కట్ చేసి ఆఫీస్ లోనికి వెళ్లిపోయారు. స్కూల్ వద్ద జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని పోలీసులు  కాంగ్రెస్, బీఆర్ఎస్  నాయకులెవరినీ ఎంపీడీవో ఆఫీస్ లోనికి అనుమతించ లేదు. దీంతో ఇరుపార్టీల నాయకులు పోటా పోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తోపులాడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి, ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాక పరిస్థితి సద్దుమనిగింది.