ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ నిర్మల్​ కలెక్టరేట్ ముట్టడి

  • బైఠాయించిన దిలావర్​పూర్, 
  • గుండంపెల్లి గ్రామాల ప్రజలు 
  • విచారణ జరిపిస్తామన్న కలెక్టర్​
  • కేసు నమోదు చేసిన పోలీసులు

నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా దిలావర్​పూర్,  గుండంపెల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని రెండు గ్రామాల రైతులు బుధవారం నిర్మల్​ కలెక్టరేట్​ను ముట్టడించారు. వందలాది మంది రైతులు, మహిళలు, యువకులు కలెక్టరేట్ కు తరలివచ్చి మెయిన్​రోడ్డుపై బైఠాయించారు.

వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దంటూ కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు. కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

చర్యలు తీసుకుంటాం : కలెక్టర్​ అభిలాష

ఫ్యాక్టరీ వద్దంటూ కలెక్టర్ అభిలాష అభినవ్​కు వినతిపత్రం అందజేయగా ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి పరిస్థితి ఏదైనా తలెత్తే అవకాశం ఉంటే పనులను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగినివ్వబోమన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రదేశంలో ఆర్డీవో, తహసీల్దార్ల బృందం దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

కేసులు పెట్టిన పోలీసులు

మరోవైపు కలెక్టరేట్​ను ముట్టడించిన దిలావర్​పూర్​ గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిర్మల్​లో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా 20 ఆటోల్లో  వచ్చి ఆందోళన చేపట్టారంటూ కేసులు  పెట్టారు. అనిల్ కుమార్, వీరేశ్, సాయన్నతో పాటు, ఆటోలపైనా కేసులు నమోదు చేసినట్లు టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ వివరించారు.