చినుకు పడితే గండమే.. చెరువులను తలపిస్తున్న మున్సిపాలిటీ లోతట్టు ప్రాంతాలు

  • ఇళ్లల్లోకి వస్తున్న వరద నీరు
  • అక్రమ నిర్మాణాలతో మూసుకుపోతున్న కాల్వలు
  • పట్టించుకోని మున్సిపల్, నీటిపారుదల అధికారులు
  • ఈసారీ ప్రజలకు కష్టాలే

వర్షకాలంలో వరద ముప్పు సమస్య లోతట్టు ప్రాంతాలను వెంటాడుతోంది. ఈసారి వర్షాలు ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ప్రజలు జంకుతున్నారు. కాల్వలను డైవర్ట్ చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టడం, చెరువులు, కుంటలను కబ్జా చేసి వెంచర్లు వేయడం, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాల చేపట్డడంతో ఏటా సమస్యలు తప్పడం లేదు.

సంగారెడ్డి, వెలుగు : జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, తెల్లాపూర్, అమీన్పూర్, నారాయణఖేడ్ మున్సిపాలిటీల పరిధిలో ముంపు సమస్య ఎక్కువగా ఉంది.  చిన్నపాటి వర్షం పడితేనే లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈసారీ తమకు కష్టాలు తప్పేలా లేవని బాధిత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   గ్రేడ్​వన్ మున్సిపాలిటీ అయిన సంగారెడ్డిలో నాల్సబ్ గడ్డ, రాజంపేట, మార్క్స్ నగర్, కింది బజార్ కాలనీలు వర్షాకాలంలో మునిగిపోతాయి. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో బకెట్లతో బయటికి ఎత్తిపోస్తారు. అక్కడక్కడ ఇండ్లు తడిసి కూలిపోయిన ఘటనలు లేకపోలేదు.

సదాశివపేట మున్సిపాలిటీలో లోతట్టు ప్రాంతం రాఘవేంద్రనగర్ కాలనీలో తరచూ వరద నీరు చేరి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉబ చెరువు ఎఫ్​టీఎల్ ప్రాంతంలో గతంలో ఇండ్లు నిర్మించుకున్నారన్న సమస్య ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.


నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కొన్నిచోట్ల మెయిన్ రోడ్లు సైతం వరద నీటితో మునిగిపోతున్నాయి. ఆయా సమస్యలకు నాలాల కన్వర్షన్ సరిగ్గా లేకపోవడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.  అయినా మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ముంపు ప్రాంత వెల్ఫేర్ అసోసియేషన్లు..

పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో గతంలో కొన్ని నిర్మాణ సంస్థలు నాలాలను డైవర్షన్ చేసి అక్రమ కట్టడాలు కట్టాయి. ఇక్కడ బహుళ అంతస్తుల బిల్డింగులు నిర్మించడంతో ఏకంగా ముంపు ప్రాంత వెల్ఫేర్ అసోసియేషన్లు వెలిశాయి. అక్కడి సమస్యలను తరచూ జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తూ .. బంధం కొమ్ము, పెద్ద చెరువు, కృష్ణ బృందావన్ కాలనీ అసోసియేషన్ సభ్యులు వరద ముప్పు నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలను కబ్జా పెట్టి అక్రమ వెంచర్లు వేసి అమాయకులకు అంటగట్టారు. ప్రస్తుతం ఆయా కాలనీలు వర్షాకాలంలో వరద నీటిలో మునిగిపోతున్నాయి. వర్షాలు మొదలుకాకముందు ఇటీవల జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ అమీన్పూర్ పెద్ద చెరువు, ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను పరిశీలించారు. పెద్ద చెరువు శిఖం భూముల ఎఫ్​టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించిన రిపోర్టులను వెంటనే ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

10 రోజులు బయటకు వెళ్లలేని పరిస్థితి


చెరువును తలపిస్తున్న ఈ ప్రాంతం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని వసంత్ విహార్ కాలనీ. నాలాల ఆక్రమణల కారణంగా ఈ కాలనీ పూర్తిగా వరద నీటితో నిండిపోతోంది. ఈ కాలనీ మీదుగానే పస్తాపూర్​లోని నారింజ వాగుకు వరద ప్రవహిస్తుంది. పట్టణంలోని మిగతా కాలనీల మురుగునీరు కూడా ఇక్కడి నుంచే వెళ్తోంది. సరైన లైన్ లేకపోవడంతో వసంత్ విహార్ కాలనీలోకి వరద నీరు చేరి చెరువును తలపిస్తోంది. పైగా ఈ కాల్వ చుట్టుపక్కల అన్ని అక్రమ నిర్మాణాలు చోటు చేసుకోవడంతో వరదంతా తమ కాలనీలోకి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతేడాది వర్షాకాలంలో తమ కాలనీ పూర్తిగా మునిగిపోయి పది రోజులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.