బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి పూర్వవైభవం : ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిని మూసివేయొద్దని, అన్ని విధాలా అభివృద్ధి చేసి ఈ ప్రాంత కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ బి.సుజాతకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ విజ్ఞప్తి చేశారు. శనివారం సీఎంవో ఏరియా ఆస్పత్రిని సందర్శించగా.. ఆస్పత్రి పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ సమక్షంలో ఎమ్మెల్యే వినోద్ సీఎంవోతో చర్చలు జరిపారు. ఆస్పత్రిని మూసివేయకుండా వెంటనే పునరుద్ధరించి వైద్య నిపుణులను నియమించాలని కోరారు. 

అవసరమైతే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకెళతానన్నారు. స్పందించిన సీఎంవో రెండు నెలల్లో ఈ ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకువస్తామని,  వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందితో పాటు వైద్య నిపుణులను నియమిస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను పున:ప్రారంభిస్తామని, మూసివేసిన మెడికల్ స్టోర్ ను పునరుద్ధరిస్తామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, ఆస్పత్రి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు మనిరాంసింగ్, ఉపాధ్యక్షులు చిప్ప నర్సయ్య, సిద్ధంశెట్టి రాజమౌళి, ఎండీ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.