ఆలు సాగు మరింత భారం

  • పెరిగిన విత్తన ధరలు, పెట్టుబడి ఖర్చులు
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో 20 వేల ఎకరాల్లో సాగు
  • సబ్సిడీ కింద విత్తనాలు అందజేయాలని కోరుతున్న రైతులు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: ఆలు రైతులకు గతేడాదితో పోలిస్తే విత్తనాలతో పాటు ఇతర ఖర్చులు 20 నుంచి 30 శాతం పెరిగాయి. స్థానికంగా ఆలు విత్తనాలు దొరకకపోవడంతో ఆగ్రా, జలంధర్ నుంచి విత్తనాలను తెప్పిస్తారు. గతేడాది 50 కిలోల బ్యాగ్ ధర రూ.1500 పలుకగా ప్రస్తుతం అది రూ.2 వేలకు చేరింది. ఇటు విత్తనాల ధరలు పెరగడంతో పాటు దున్నకం, ఫెస్టిసైడ్స్, ఎరువులు, కూలీల ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి.

 ఎకరా ఆలు సాగుకు రూ.60 వేలు ఖర్చు పెడుతున్నా దిగుబడి వచ్చే సమయానికి ధరల్లో తేడాలు వచ్చి ఆశించిన లాభాలు రావడంలేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆలుగడ్డ సాగు దాదాపు 20 వేల పై చిలుకు ఎకరాల్లో సాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో10 వేలు, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేటలో 5 వేల పై చిలుకు, మెదక్ జిల్లాలో నర్సాపూర్ వ్యవసాయ డివిజన్​లో 5 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగు చేస్తుంటారు.

 సిద్దిపేట జిల్లా రైతులు పండించిన పంటను కొంత స్థానికంగా అమ్ముకోగా మరికొందరు హైదరాబాద్, బోయినిపల్లి, వంటిమామిడి మార్కెట్లకు తరలిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పాటు తొందరగా పంట చేతికి వస్తుందని రైతులు ఆలు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత సీజన్ లో ఇప్పటికే విత్తడం ప్రారంభం కాగా మరో నెల రోజుల పాటు ఇది కొనసాగుతుంది. జనవరి రెండో వారం నుంచి ఆలుగడ్డ దిగుబడి మొదలవుతుంది. 

పెరిగిన ఆలు విత్తన ధరలు

ఆలు విత్తనాలకు నగదు చెల్లిస్తే 50 కిలోల బస్తాకు రూ.1500 నుంచి రూ.1600 వరకు ధర పలుకుతోంది. పంట దిగుబడి తర్వాత డబ్బులు చెల్లిస్తే దళారులు చెప్పిన రేటుకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల 50 కిలోల విత్తనాల ధర రూ. 2 వేల వరకు చేరుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు దిగుబడిపై ప్రభావం చూపుతుంటే లద్దె పురుగు, కత్తెర పురుగు, దోమకాటు, ఇతర తెగుళ్ల కారణంగా పెట్టుబడి ఖర్చు మరింత పెరుగుతోంది. 

ఎకరా ఆలు సాగుకు రూ.60 వేల వరకు ఖర్చు చేస్తే అందులో విత్తానాలకు 50 శాతం పోగా మిగిలిన 50  శాతం ఫెస్టిసైడ్,  దున్నకం, కూలీల ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ తరపున డ్రిప్ పరికరాల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో రైతులే నీటి సౌకర్యం కోసం  సొంత డబ్బులను వెచ్చించి ఏర్పాటు చేసుకుంటున్నారు. 

దీంతో ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. ఒక్కో ఆలు రైతు డ్రిప్ సౌకర్యం కోసం రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తున్నాడు. దీంతో ఖర్చులు పెరుగుతున్నా ఆశించిన మేర లాభాలు రావడం లేదని ఆలు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలు అందజేయాలని ఆలు రైతులు కోరుతున్నారు. 

పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నయ్

ఆలుగడ్డ సాగు ఖర్చులు ఏటా పెరుగుతున్నయ్. ఐదెకరాల్లో ఆలుగడ్డ పంట కోసం లక్షల రూపాయల పెట్టుబడి పెడుతున్నా. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు విత్తన ధరలు మరింత పెరిగినయ్. పెట్టుబడి కూడా 20 నుంచి  30 శాతం పెరిగింది. పంట వేయడానికి గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ఖర్చవుతోంది. - తుమ్మల స్వామి, ఆలుగడ్డ రైతు, అనంతగిరిపల్లి

పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నాం

ఆలుసాగుకు ఖర్చులు పెరగడంతో అప్పులు చేస్తున్నాం. విత్తనాలపై సబ్సిడీ లేకపోవడంతో ఉత్తరాది నుంచి వచ్చే ఆలు విత్తనాలను వారు చెప్పిన ధరకే కొనాల్సి వస్తోంది. పంట త్వరగా చేతికి వస్తుందని కష్టపడి పండిస్తే మార్కెట్ కు వచ్చేసరికి ధరలు తగ్గుతున్నాయ్. దీంతో ఆలు రైతుకు  కన్నీళ్లే మిగులుతున్నయ్.- బరిగెల మల్లేశ్, ఆలు రైతు, ములుగు