ఫుడ్​ అమ్మకాలపై ఇష్టారాజ్యం

  • హోటల్స్​, రెస్టారెంట్లలో నాణ్యత లేని ఫుడ్​
  • కస్టమర్లు కంప్లైంట్​ చేస్తే తప్ప కానరాని అధికారులు
  • ఫైన్లు వేసి వదిలేస్తున్న ఫుడ్​ ఇన్​స్పెక్టర్లు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఫుడ్​ అమ్మకాలపై వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఇటీవల హోటళ్లు, దాబాలు, బేకరీలు, స్వీట్​షాపులు, సూపర్ స్టోర్లలో నాణ్యత లేని, ఎక్స్ పైరీ అయిన ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్న విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫుడ్ ఇన్​స్పెక్టర్లు, మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్లు వ్యాపారుల వద్ద లంచాలు తీసుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా షాప్ లో క్వాలిటీ లేని, పాడై పోయిన ఫుడ్ ఐటమ్స్​బయట పడి, వినియోగదారులు గొడవ చేస్తే అధికారులు సంబంధిత వ్యాపారులకు  ఫైన్ విధించి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. 

మెదక్ లో ముగ్గురికి ఫైన్..

ఇటీవల మెదక్ పట్టణంలో బూజు పట్టిన స్వీట్స్, ఫ్రూట్స్, ఎక్స్​పైరీ అయిన ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారని ఓ స్వీట్ షాప్, మోర్ సూపర్ మార్కెట్, రిలయన్స్ స్మార్ట్ స్టోర్లకు మున్సిపల్ శానిటరీ ఇన్​స్పెక్టర్​ఫైన్ వేశారు. సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు లేక హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, దాబాలు, బేకరీలు, స్వీట్స్ షాపుల్లో విచ్చలవిడిగా కల్తీ విక్రయాలు జరుగుతున్నాయి.

ఫసల్వాడి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్, పటాన్ చెరు మండలం చిట్కుల్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ క్యాంటీన్, రుద్రారంలోని చైతన్య కాలేజీ హాస్టల్ క్యాంటీన్లలో ఇటీవల ఎఫ్ఎస్ఎస్ఏఐ బృందం, మొబైల్ ప్రయోగశాల బృందంతో ఆకస్మిక  తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ ఇన్​స్పెక్టర్​ధర్మేందర్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో అనేక లోపాలు బయటపడ్డాయి. వంటగది ప్రాంగణంలో ఈగలు ఉండడం, మైదాపిండిలో బ్లాక్ బగ్స్, కూరగాయలు స్టోర్​చేసే ప్రదేశంలో సాలెపురుగులు కనిపించాయి. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ రికార్డ్ లు లేకపోవడం, తాగునీటి పీహెచ్ పరిమితికి మించి ఉండడాన్ని అధికారులు గమనించారు. 

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేటలోని నాసర్ పురాలో వారం రోజు కింద రామంచ గణేశ్ అనే వ్యక్తి కూల్ డ్రింక్స్ కొనుగోలు చేయగా ఎక్స్​పైరీ అయిన వాటిని విక్రయించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో  ఓ బేకరీలో కుళ్లిపోయిన కేకులు అమ్ముతున్నారనే ఫిర్యాదుపై మున్సిపల్ శానిటరీ ఇన్​స్పెక్టర్​తనిఖీలు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకుని బేకరి యజమానికి రూ.10 వేల జరిమానా విధించారు. చేర్యాలలో చెడిపోయిన స్వీట్లు అమ్ముతుండగా కొనుగోలుదారులు గుర్తించడంతో వాటిని షాపు యజమాని తొలగించారు. సిద్దిపేట పట్టణంలో రెండు కిరాణా షాపుల్లో కాలం చెల్లిన ఐస్ క్రీమ్ లు అమ్ముతుండగా కొనుగొలుదారులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు.