పెరిగిన ఓటింగ్ తో ఎవరికి లాభం!

  • తమకే అనుకూలం అంటున్న ప్రధాన పార్టీలు
  • మెదక్​ లోక్​ సభ స్థానంలో 75.09 శాతం పోలింగ్ నమోదు
  • గత పార్లమెంట్​ ఎన్నికలకంటే 3.38 శాతం ఎక్కువ

మెదక్‌‌, వెలుగు: గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చిచూస్తే ఈ సారి మెదక్ లోక్ సభ ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగింది. 2019 లోక్​ సభ ఎన్నికల్లో 71.71 శాతం ఓట్లు పోల్ కాగా.. ఇప్పుడు 75.09 శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పటికంటే 3.38 శాతం ఓటింగ్​ పెరిగింది. మెదక్, నర్సాపూర్​, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్​లలో గతంలో కంటే పోలింగ్​ శాతం పెరుగగా, సంగారెడ్డి, పటాన్​ చెరు అసెంబ్లీ సెగ్మెంట్​ లలో కొద్దిగా తగ్గింది. అత్యధికంగా నర్సాపూర్​ అసెంబ్లీ సెగ్మెంట్​లో 84.25 శాతం పోలింగ్​ నమోదు కాగా, అత్యల్పంగా పటాన్​ చెరు అసెంబ్లీ సెగ్మెంట్​లో 63.01 శాతం పోలింగ్​ నమోదైంది. 

కాగా మెజారిటీ సెగ్మెంట్ లలో పెరిగిన ఓటింగ్ ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు ఓటింగ్​ పెరగడం తమకే అనుకూలమని చెబుతున్నాయి. లోక్​ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 2.50 లక్షల ఓట్లు పెరిగాయి.. కొత్తగా ఓట హక్కు లభించిన యువ ఓటర్లతో పాటు,  ఉద్యోగులు, వ్యాపారులు  కమలం గుర్తుకు ఓటేశారని బీజేపీ విశ్వసిస్తోంది. 

కాగా రైతులు, మహిళలు, ముస్లీం, క్రిస్టియన్​ మైనార్టీలు ఎక్కువ శాతం తమకు మద్దతిచ్చారని అందువల్ల ఆయా వర్గాల ఓట్లు తమకే ఎక్కువ పడ్డాయని కాంగ్రెస్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేఖత పెరిగిందని, రైతులు, వృద్ధులు, మహిళలు తమకు సపోర్ట్​ చేశారని, అంతేగాక తాము పకడ్బందీగా చేసిన పోల్​మేనేజ్​ మెంట్​ వల్ల అన్ని సెగ్మెంట్​ లలో తమకు అనుకూలంగా పోలింగ్​ జరిగిందని బీఆర్​ఎస్​ పార్టీ పేర్కొంటోంది. ఇలా మూడు పార్టీలు ​ ఎవరికి వారు తమకే మెజారిటీ ఓట్లు పోలయ్యాయని, తమదే గెలుపనే ధీమా వ్యక్తం
 చేస్తున్నాయి. 

జహీరాబాద్​ స్వల్పంగా పెరిగిన ఓటింగ్​ .. 

సంగారెడ్డి :  జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 2019 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన పోలింగ్ లో 0 .46శాతం పెరిగింది.   జహీరాబాద్ లోక్ సభ స్థానంలోని   ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో  మొత్తం 74.54 శాతం పోలింగ్  నమోదైంది.  2019లో  74.8 శాతం ఓట్లు పోలయ్యాయి.   పెరిగిన స్వల్ప పర్సెంటేజీ తమవైపే పోల్ అయ్యాయని బీజేపీ , కాంగ్రెస్  చెప్పుకుంటున్నాయి .  జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో ఉపయోగించిన ఈవీఎంలను సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ లకు మంగళవారం ఉదయం తరలించారు.   రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూర్ పర్యవేక్షణలో అధికారులు ఈవీఎంలను రుద్రారం స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. 

పోలింగ్​ శాతం వివరాలు


సెగ్మెంట్‌‌    2019    2024 
మెదక్‌‌    72.83    80.19
నర్సాపూర్‌‌    77.75    84.25
సిద్దిపేట    68.13    73.64
గజ్వేల్‌‌    76.48    80.31
దుబ్బాక    73.86    82.42
సంగారెడ్డి    72.60    71.99
పటాన్‌‌చెరు    65.13    63.01