కోల్బెల్ట్, వెలుగు : మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రశాంత జీవితం గడపాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు బబ్బెర రవి కుటుంబ సభ్యులను పోలీసులు పరామర్శించారు. ఈ సందర్భంగా రవి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు. దాదాపు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రవిని లొంగిపోయేలా నచ్చజెప్పాలని తల్లి లక్ష్మికి సూచించారు.
ఈ సందర్భంగా ఏసీపీ నిత్యావసర సరుకులు, బియ్యం, దుప్పట్లను అందజేశారు. ఏసీపీ మాట్లాడుతూ... మావోయిస్టులు సాధ్యం కాని సిద్ధాంతాలు, ఆశయాలతో అడవిలో ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే తప్పా సాధించింది ఏదీ లేదన్నారు. జన జీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామని, అనారోగ్యం తో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులున్నా చట్టపరిధిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చారని, కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం అర్థం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మందమర్రి సీఐ శశీధర్రెడ్డి, ఎస్ఐ. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.