చెన్నూర్‌‌ శివారులో .. 200 బస్తాల ఎరువులు పట్టివేత

  • తెలంగాణ రైతుల పేరిట మహారాష్ట్రకు తీసుకెళ్తున్నట్లు అనుమానం
  • ఆన్‌‌లైన్‌‌ బిల్లులు లేకపోవడంతో స్టేషన్‌‌కు తరలించిన ఆఫీసర్లు

చెన్నూర్, వెలుగు : ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల ఎరువులను గురువారం సాయంత్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌ శివారులో పోలీసులు పట్టుకున్నారు. చెన్నూర్‌‌ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా ఎరువులను తరలిస్తున్నారని ఎమ్మెల్యే జి.వివేక్‌‌ వెంకటస్వామికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఎరువుల అక్రమ రవాణాను అరికట్టాలని ఆయన ఆఫీసర్లను ఆదేశించారు.

ఈ క్రమంలో చెన్నూర్ టౌన్‌‌ సీఐ రవీందర్‌‌ సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం ఎన్‌‌హెచ్‌‌ 63పై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో డీఏపీ, యూరియాతో పాటు కాంప్లెక్స్‌‌ ఎరువులతో వెళ్తున్న నాలుగు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఆన్‌‌లైన్‌‌ బిల్లులు లేకపోవడంతో మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌‌ శ్రీనివాస్‌‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చెన్నూరులోని కామాక్షి ట్రేడర్స్, లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్‌‌ నుంచి కోటపల్లి మండలంలోని అన్నారం, రొయ్యలపల్లి గ్రామాలకు చెందిన రైతుల పేర్ల మీద ఎరువులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. బిల్లులు లేకపోవడంతో వాహనాలను సీఐ రవీందర్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌కు తరలించారు. తెలంగాణ రైతుల పేరిట ఎరువులను మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.