కాగజ్ నగర్, వెలుగు: వరదలో చిక్కుకున్న యాచకుడిని కాపాడి పోలీసు సిబ్బంది శెభాష్ అనిపించారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం హడ్కులి ఎత్తిపోతల పథకం వద్ద ఓ యాచకుడు చిన్న గుడిసె వేసుకొని ఉంటున్నారు. వార్ధా నదికి గురువారం వరద పోటెత్తడంతో ఆ గుడిసె నీటిలో మునిగింది. ప్రాణభయంతో యాచకుడు పక్కనే ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్ ఎక్కాడు.
స్థానికుల సమాచారంతో ఎస్సై రమేశ్ హుటాహుటిన సిబ్బందితో అక్కడకు చేరుకొని తాళ్ల సహాయంతో బాధితున్ని భూజాలపై ఎత్తుకొని ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం మండల కేంద్రానికి తీసుకువచ్చి బట్టలు, దుప్పట్లు, నిత్యావసర సరకులు అందజేసి ఔదార్యం చాటుకున్నారు. మరోవైపు, పెంచికాల్ పెట్ మండలం జై హింద్ పూర్ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ స్కూల్ ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ వర్షానికి సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో టీచర్ సంతోష్ భుజాలపై ఎక్కించుకుని సుమారు 30 మంది పిల్లల్ని వాగు దాటిచ్చాడు.