- గవర్నమెంట్ టీచర్లే సూత్రధారులు
- అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నిర్మల్ పోలీసులు
- వీడనున్న చైన్ దందా చిక్కుముడి
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో నెల రోజుల నుండి చర్చనీయాంశంగా మారిన యూ బిట్ కాయిన్ చైన్ దందాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ దందాలో పెట్టుబడులు పెట్టిస్తూ స్టార్ హోల్డర్లుగా మారిన అసలు సూత్రధారులను అరెస్ట్ చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. వేలాది మంది అమాయకులతో పెట్టుబడులు పెట్టిస్తున్న కొంత మంది టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులను కొద్ది రోజుల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో ఈ దందా కలకలం రేపింది. ప్రతిరోజు రూ. లక్షల్లో లావాదేవీలు సాగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
దీంతో ఎస్పీ ఆధ్వర్యంలో ఓ స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. జిల్లాలోని క డెం, పెంబి, ఖానాపూర్, నిర్మల్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి దందా గుట్టు నిగ్గు తేల్చారు. ఇప్పటికే ఎక్సైజ్ ఎస్ఐతో పాటు కానిస్టేబుల్, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, ఇద్దరు గవర్నమెంట్ టీచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా 8 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు.
స్టార్ హోల్డర్లలో ఎక్కువగా టీచర్లే..
యూ బిట్ కాయిన్ దందాలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టించిన వారికి ఆ యాప్ నుంచి వన్ స్టార్ గుర్తింపు లభిస్తుంది. రూ.25 లక్షలకు 2 స్టార్, రూ. 50 లక్షలకు 3 స్టార్, రూ.75 లక్షలు పెట్టిస్తే 4 స్టార్, రూ. కోటి వరకు పెట్టిస్తే 5 స్టార్ రేటింగ్ ను ఆ సంస్థ కేటాయిస్తుంది. ఈ రేటింగ్ ఆధారంగా వారి యాప్ లోని అకౌంట్ లో ప్రతిరోజు కమీషన్ రూపంలో పెద్ద మొత్తంలో జమ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే జిల్లాలో 20 మందికి పైగా టీచర్లే ఈ స్టార్ రేటింగ్ పొందిన వారిలో ఉన్నట్లు చెబుతున్నారు.
వీరంతా తమ పరిచయాలను అడ్డం పెట్టుకొని వేలాది మందిని సభ్యులుగా చేర్పిస్తూ.. తమకు వచ్చే కమీషన్ ను నగదు రూపంలో తీసుకుంటున్నారని అంటున్నారు. రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి నెలా రూ.14,850 కమీషన్ జమ అవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ లావాదేవీలన్నీ బ్యాంక్ అకౌంట్ లో కాకుండా యాప్ అకౌంట్ లో జరుగుతుండడం అనుమానాలకు తావిస్తోంది.
నేడు అరెస్ట్ చూపే అవకాశం..
యూ బిట్ కాయిన్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న 8 మంది స్టార్ హోల్డర్లను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. పోలీసుల అదుపులో ఉన్న వారంతా ప్రభుత్వ టీచర్లేనని ప్రచారం జరుగుతుండడంతో, ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిని బుధవారం అరెస్ట్ చేసినట్లు చూపించే అవకాశం ఉందంటున్నారు.