యాక్సిడెంట్ల నివారణకు పకడ్బందీ చర్యలు : ఎం.శ్రీనివాస్​

  • వివిధ శాఖల అధికారులతో సీపీ శ్రీనివాస్​ రివ్యూ మీటింగ్​ 

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో యాక్సిడెంట్ల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్​ కమిషనర్​ ఎం.శ్రీనివాస్​ అన్నారు. శుక్రవారం కమిషనరేట్​ హెడ్​క్వార్టర్స్​లో పోలీస్​, రెవెన్యూ, మున్సిపల్​, ట్రాన్స్​పోర్టు, నేషనల్​ హైవేస్​ అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. యాక్సిడెంట్లను కంట్రోల్​ చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ప్రణాళికలను రూపొందించాలన్నారు. మానవ తప్పిదాల వల్లే మెజారిటీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. వీటిలో 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నేషనల్ హైవే 63,363, స్టేట్ హైవే 01,155,24,15, ఇతర రోడ్లపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్​ వద్ద పోలీస్, ట్రాఫిక్, ఇతర అధికారులు యాక్సిడెంట్లకు కారణాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. రేడియం స్టికర్లతో సూచికలను, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, కెమెరాలు, లైట్లు, స్పీడ్ కెమెరాలు, జంక్షన్ ల వద్ద, పాదచారులు రోడ్డు దాటే దగ్గర జిబ్రా క్రాసింగ్, లైటింగ్, రోడ్డు రిఫ్లెక్టింగ్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ సబావత్​ మోతీలాల్​, ఏసీపీలు ఆర్​.ప్రకాశ్​, వెంకటేశ్వర్లు, రవికుమార్​ పాల్గొన్నారు.