సిద్దిపేట కేసీఆర్​నగర్​లో.. గంజాయి బ్యాచ్ అరెస్ట్

  • కటకటాల్లోకి తొమ్మిది మంది
  • 4 కిలోల సరుకు స్వాధీనం

సిద్దిపేట టౌన్, వెలుగు : ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి సిద్దిపేటలో అమ్ముతున్న వ్యక్తితో పాటు అతడి వద్ద గంజాయి కొంటున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. బుధవారం ఆయన టూ టౌన్ పీఎస్​లో సీఐ ఉపేందర్​తో కలిసి వివరాలు వెల్లడించారు. కోహెడ మండలం బస్వాపూర్​కు చెందిన బానోతు గణేశ్..పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరుకు చెందిన నలిమెల వినోద్ దగ్గర తక్కువ ధరకు గంజాయి కొని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

బుధవారం పట్టణంలోని కేసీఆర్ నగర్ సమీపంలో గణేశ్ గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పట్టుకున్నట్లు చెప్పారు. కాగా, అంతగిరి అరుణ్, పొన్నాల కుమార్, బాదరబోయిన కర్ణాకర్, సిద్దరబోయిన అఖిల్, నారాయణరావు పేట చందు, కానిగంటి గణేశ్, అంబాటి లక్ష్మీ నర్సింహ, తాటి కొండ శ్రీమాన్... గణేశ్​దగ్గర గంజాయి కొనుగోలు చేశారన్నారు. వీరంతా 20 ఏండ్లలోపు వారేనని, వీరందరి దగ్గర 4 కిలోల గంజాయి, 9 సెల్ ఫోన్లు, కారు, రూ.23వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.