- మూడు చోట్ల 18 మంది అరెస్ట్
కోటపల్లి/జైపూర్/నేరడిగొండ, వెలుగు: వేర్వేరు చోట్ల నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 18 మందిని అరెస్ట్ చేశారు. కోటపల్లి మండలంలోని శంకరాపూర్ అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్ఐ రాజేందర్ సిబ్బందితో దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10,930 నగదు, 4 సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిలో బుచ్చిరెడ్డి సంతోషం, తోడే లక్ష్మణ్, తోటపల్లి సుధాకర్, సోమనపల్లి సందీప్ ఉన్నారు. మరో ముగ్గురు పరారైనట్లు చెప్పారు. జైపూర్మండలం దొరగారి పల్లె శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు.
పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి గోదావరిఖనికి చెందిన కామెర లలిత ప్రసాద్, మాతంగి ఓదెలు, ఆడెపు వెంకటేశం, దాసరి అశోక్, గోనె తిరుమలేశ్, నల్లమ శ్రీనివాస్, కోడిపెల్లి రామకృష్ణను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ.7,835, ఐదు సెల్ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేపట్టి ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.5850 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.