పొచ్చర జలపాతం రోడ్డు బంద్‌

బోథ్, వెలుగు : భారీ వర్షాలు పడుతుండడంతో ఆదిలాబాద్​జిల్లా బోథ్‌‌ మండలంలోని పొచ్చర జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో జలపాతానికి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టారు. జలపాతం వద్దకు పర్యాటకులు ఎవరూ రావొద్దని సూచించారు. జలపాతానికి వెళ్లే రోడ్డును ఈ నెల 22 వరకు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.

జాలువారుతున్న భీమునిపాదం జలపాతం

గూడూరు, వెలుగు : మహబూబాబాద్‌‌ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారులోని భీమునిపాదం జలపాతం జలకళను సంతరించుకుంది. ఎత్తైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతంలో 60 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న నీటిని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. నేడు సెలవు కావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఫారెస్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం షెడ్లు, సిమెంట్‌‌ బల్లలు ఏర్పాటు చేశారు.