భూములు అమ్మే ప్లాన్ చేస్తుండ్రు: హరీశ్​రావు

అందుకే బడ్జెట్​లో నాన్ రెవెన్యూ ఇన్‌‌కమ్ ఎక్కువగా చూపారు

హైదరాబాద్, వెలుగు: భూముల అమ్మకానికి రాష్ట్ర సర్కారు రంగం సిద్ధం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు ఆరోపించారు. అందుకే నాన్ ట్యాక్స్‌‌ రెవెన్యూ రాబడిని బడ్జెట్‌‌లో ఎక్కువ చేసి చూపించారని అన్నారు. నిరుడు నాన్ ట్యాక్స్‌‌ రెవెన్యూ రూ.22 వేల కోట్లు వస్తే, ఈసారి ఏకంగా రూ.35 వేల కోట్లు వస్తుందని చూపించారని, అంతగానం ఎట్లొస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

గురువారం అసెంబ్లీ మీడియా హాల్‌‌లో హరీశ్‌‌రావు మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌‌లో ఆరు గ్యారంటీల ప్రస్తావనే లేదన్నారు. నెలకు రూ.4 వేల పెన్షన్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన పెన్షనర్లకు నిరాశే మిగిలిందని అన్నారు. ‘‘రుణమాఫీపై స్పష్టత ఇవ్వలేదు. బీసీలకు లక్ష కోట్లు ఇస్తామని చెప్పి..రూ.9 వేల కోట్లతో సరిపెట్టారు. ఇరిగేషన్‌‌కు బడ్జెట్ కేటాయింపులు తగ్గించారు. దళితబంధు, గిరిజన బంధు ప్రస్తావనలేదు. ఆసరాకు బడ్జెట్ తగ్గించారు.

 పీఆర్సీ ప్రస్తావన లేదు. మద్యం ఆదాయాన్ని ఏడాదిలో రూ.15 వేల కోట్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నదని హరీశ్​రావు ఆరోపించారు. ఎక్సైజ్ ఆదాయాన్ని పోయినేడాది కంటే రూ.7,100 కోట్లు ఎక్కువగా చూపించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌‌ ఆదాయాన్ని నిరుడి కంటే రూ.4,050 కోట్లు ఎక్కువగా చూపించారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ.35 వేల కోట్లు వస్తుందని చూపించారు. భూములు అమ్మితే, ఓఆర్‌‌ఆర్‌‌‌‌ లీజుకిస్తేనే గతేడాది రూ.22 వేల కోట్లు వచ్చింది. ఈ ఏడాది ఎలా రూ.35 వేల కోట్లు వస్తదో చెప్పడం లేదు. దీన్నిబట్టి భూముల అమ్మకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు స్పష్టమవుతున్నది” అని హరీశ్‌‌రావు పేర్కొన్నారు.