ఆన్​లైన్​లో పంట వివరాలు తప్పుగా నమోదు..రైతుల ఆందోళన

పెంబి, వెలుగు: ఆన్​లైన్​లో పంట వివరాలను తప్పుగా నమోదు చేశారని పెంబి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.  మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు మాట్లాడుతూ.. పెంబి సెక్టార్​లో దాదాపు 950 ఎకరాల్లో పత్తితోపాటు పసుపు, 50 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నామని తెలిపారు.

కానీ రైతుల వివరాలు సేకరించకుండా వ్యవసాయ అధికారులు ఆన్​లైన్​లో ఇష్టానుసారంగా నమోదు చేశారని మండిపడ్డారు. 950 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో పత్తి, పసుపు సాగు చేస్తున్నట్లు తప్పులు నమోదు చేసినట్లు చెప్పారు. దీంతో సీసీఐకి పత్తి అమ్ముకునేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా పంట వివరాలు సక్రమంగా నమోదు చేయాలని కోరారు.